
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాలతో ఘన విజయం సాధించిన బీజేపీ.. కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్దమవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త అధ్యక్షడు ఎవరని ఆ పార్టీలో తీవ్ర చర్చజరుగుతోంది. రెండు సార్లు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా స్థానాన్ని అందుకోవడం అంత సామాన్యమైన,సులువైన విషయం కాదు. పార్టీలో అంతటి శక్తీ, సామర్థ్యాలు ఉన్న సమర్థవంతమైన నేత కోసం కమళ దళం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
వారిలో ముందు వరుసలో.. ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రథాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకుంది. అలాగే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నడ్డా బాధ్యతలు చేపట్టి.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రథాన్‌పై కూడా బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణంలో అంత ప్రభావం లేకపోయినా 2014, 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రథాన్. 2014కు ముందు ఆ పార్టీకి కేవలం 21 శాతం ఓట్ బ్యాంకు ఉంటే దానిని 2019 వరకు 39శాతం వరకు తీసుకురాగలిగారు. దీంతో వీరిద్దరిలో ఒకరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీలోని సీనియర్ల పేర్లను కూడా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుడంగా.. కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై నాలుగు గంటల పాటు సుధీర్ఘంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. దానిలో భాగంగానే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.