నిమ్న కులాలంటే బాబుకు ఎప్పుడూ చిన్నచూపే

Vara Prasada Rao Fires On Chandrababu Naidu PSR Nellore - Sakshi

బీసీ నాయకుల సమీక్షలో     మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు

బీసీలను టీడీపీ ఓటు బ్యాంక్‌గానే చూస్తోంది : కాకాణి

రాష్ట్రంలో పాలన గాడితప్పింది : కిలివేటి

గూడూరు:  నిమ్న కులాలను తక్కువగా చూడటం చంద్రబాబుకు అలవాటేనని మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. సీఎంగా అసమానతలు తగ్గించాల్సిందిపోయి ఇంకా పెరిగేలా బాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పట్టణంలోని ఆస్పత్రి రోడ్డు ప్రాంతంలో ఉన్న సీఆర్‌ మార్ట్‌లో ఆదివారం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందిన బీసీ నాయకుల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.

ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వరప్రసాద్‌రావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి చింతల రాజశేఖర్‌ అతిథులను సన్మానించారు. వెలగపల్లి మాట్లాడు తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం చేస్తు న్న చంద్రబాబుకు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారని, ఆ పదవికి ఒక క్లర్క్‌ను కూడా బదిలీ చేసే పవర్‌ లేదన్నారు. బీసీలకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా రిజర్వేషన్‌ కల్పించినప్పుడే నిజ మైన ప్రజాస్వామ్యం వచ్చినట్లన్నారు. పేదల నుంచి ఎకరం, అరెకరం పొలాలను పరిశ్రమల పేర బలవంతంగా లాక్కొని వారిని భిక్షగాళ్లను చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే బీసీలంతా ఐక్యంగా ఉండాలన్నారు.

బాబుకు అర్హత లేదు
వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బీసీ కులాలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారన్నారు. రూ.10 వేల కోట్లు బీసీల అభివృద్ధి కోసం కేటాయిస్తానన్న మాటలేమయ్యాయని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదన్నారు. కుప్పం సీటు బీసీలకు ఇచ్చి, మరోచోట బాబు పోటీ చేయొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. జగనన్న చట్టసభల్లో కూడా బీసీలకు స్థానం కల్పించాలనే థృక్పధంతో ఉన్నారన్నారు.  

జగనన్నతోనే సాధ్యం
వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేట సంజీవయ్య మాట్లాడుతూ టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, దీంతో రాష్ట్ర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. వైఎస్‌ హయాంలా రామరాజ్యం రావాలంటే అది ఒక్క జగనన్నతోనే సాధ్యమన్నారు. వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో ఆయన అన్ని బీసీ కులాలను తనతోపాటు చట్టసభల్లోకి తీసుకెళ్తానని చెప్పారన్నారు. దీనిని బట్టే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు. పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ మాట్లాడుతూ  ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగనన్నకు రాçష్ట్ర ప్రజానీకం బ్రహ్మరథం పడుతోందన్నారు.

ఆయన నడుస్తూనే అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను అనాగరికంగా మాట్లాడి ఆయన అసలు రూపాన్ని బయటపెట్టారన్నారు. అనంతరం జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరీషా, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ యారం మంజుల, నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు మాట్లాడారు. బీసీ నాయకులు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గూడూరు రాజేశ్వరరెడ్డి, మెట్టా రాధాకృష్ణారెడ్డి, వంకా రమణయ్య, కౌన్సిలర్లు నాశిన నాగులు, చోళవరం గిరిబాబు, రమీజా, జిల్లా కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాసులు, దాసరి వెంకటేశ్వర్లు, ఎల్లా శ్రీనివాసులురెడ్డి, బత్తిని విజయ్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిక
సూళ్లూరుపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాదరపాకం బాలసుబ్రహ్మణ్యం, బీసీ సంఘం నాయకులు కొండూరు జనార్దన్‌తోపాటు పలువురు కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు కిలివేటి సంజీవయ్య, మేరగ మురళీధర్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఈ మేరకు వారిని పార్టీలో చేర్పించేందుకు సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, తిరుమూరు రవిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top