‘నామా’స్తుతే..!

TRS Leader Nama Nageswar Rao Won in Khammam - Sakshi

ఖమ్మం ఎంపీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా ఘన విజయం  

1,68,062 ఓట్ల మెజారిటీతో గెలుపు

ఏడు నియోజకవర్గాల్లోనూ కొనసాగిన కారు జోరు

అసెంబ్లీ ఎన్నికలకన్నా పెరిగిన టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌

సంబరాల్లో మునిగి తేలిన పార్టీ నాయకులు, కార్యకర్తలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం పెరగడంతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన నామా.. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా ఈసారి అత్యధికంగా రావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8 గంటలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా..కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రధాన పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతుందనే రీతిలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద పరిస్థితి నెలకొని ఉండగా.. తొలిరౌండ్‌ ప్రారంభం నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండ్‌ పూర్తయ్యేటప్పటికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సుమారు రూ.11వేల ఆధిక్యంతో ఉన్నారు. అదే ఆధిక్యం చివరి వరకు కొనసాగుతూ ప్రతి రౌండ్‌కు పెరుగుతూ వచ్చింది. తొలి మూడు, నాలుగు రౌండ్ల వరకు నామా నాగేశ్వరరావుకు, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరికి మధ్య సుమారు 20వేలలోపు ఓట్ల వ్యత్యాసం ఉండగా.. 6వ రౌండ్‌ నుంచి ఈ వ్యత్యాసం క్రమేణా పెరుగుతూ వచ్చింది. తొలి రౌండ్‌ ప్రారంభం కాగానే కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రెండు రౌండ్లు పూర్తయ్యే వరకు కౌంటింగ్‌ సరళిని పరిశీలించి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ..
నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి రౌండ్‌లో మెజార్టీ లభించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందనడానికి లోక్‌సభ ఎన్నికల మెజార్టీయే నిదర్శనమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజార్టీ పాలేరు నియోజకవర్గం నుంచి లభించగా.. స్వల్ప మెజార్టీ వైరా నియోజకవర్గం నుంచి లభించింది. పార్టీకి వివిధ వర్గాలు చేరువ కావడంతోపాటు ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకుని.. నామా విజయానికి చేసిన కృషి, నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం వంటి కారణాలు సైతం పార్టీ మెజార్టీకి కారణంగా ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేసిన నామా నాగేశ్వరరావు రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఇప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి పైనే 2009, 2019లో విజయం సాధించడం విశేషం. రేణుకా చౌదరి, నామా ప్రధాన ప్రత్యర్థులుగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీపడడం ఇది మూడోసారి. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై రేణుకా చౌదరి విజయం సాధించగా.. 1999లో టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై రేణుకా చౌదరి విజయం సాధించారు.

నామా గెలుపుతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ తొలిసారిగా పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయ పతాకాన్ని ఎగుర వేసినట్లయింది. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీలో ఉండి.. ఆ పార్టీ తరఫున కాంగ్రెస్‌ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నామా నాగేశ్వరరావు విజయంపై టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించడం.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రావడం వంటి కారణాలు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ తెచ్చి పెట్టాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కౌంటింగ్‌ ప్రారంభమై నాలుగు రౌండ్లు పూర్తయ్యాక కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చిన నామా నాగేశ్వరరావు కౌంటింగ్‌ సరళిని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు.

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్‌ల స్లిప్‌లను లెక్కించిన అనంతరం ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారి ఆర్వీ.కర్ణన్‌ అధికారికంగా ప్రకటించారు. విజయం సాధించిన నామా నాగేశ్వరరావుకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అందజేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top