గ్రామ పంచాయతీలుగా  జిల్లాలో 38 తండాలు

Thandas To Grama Panchathis - Sakshi

ఆగస్టు 2నుంచి  పాలన ప్రారంభం

పంచాయతీ ఎన్నికల వరకు ప్రత్యేకాధికారుల చేతుల్లోనే..

ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

భవనాలు, వసతుల కల్పనకు చర్యలు

రెండు, మూడు రోజుల్లో  ప్రభుత్వానికి నివేదిక

గిరిజనుల్లో వెల్లివిరుస్తోన్న ఆనందం

సాక్షి, యాదాద్రి : మాతండాలో మా రాజ్యం కావా లని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనుల ఆశలు నెరవేరబోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వం నూతనంగా 84 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా అందులో 38 తండాలు ఉన్నాయి. వీటిలో పూర్తిగా వందశాతం గిరిజనులు కలిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాలు 31 ఉన్నాయి.

నూతన పంచాయతీల్లో ఆగస్టు 2నుంచి పాలన ప్రారంభమవుతుం ది. అయితే పంచాయతీ ఎన్నికలకు మరికొంత సమయం ఉండడంతో అప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ మేరకు తండాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గెలిచినా కీలుబొమ్మలే..!

ఇంతకాలం మరుగునపడిన తండాల్లో ‘కొత్త’ శకం ప్రారంభం కాబోతోంది. రిజర్వేషన్‌ల ప్రకా రం వారికి ప్రజాప్రతినిధులుగా అవకాశం వచ్చి నా ఆయా గ్రామాల్లో ఉండే ఇతర కులాల పెద్దల చేతుల్లో కీలు బొమ్మలుగా ఉండేవారు. రిజర్వేషన్‌ల ప్రకారం సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచినప్పటికీ అధికారం మొత్తం వారి చేతుల్లో ఉండేది కాదు.

అలాగే ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారికి అందకుండాపోయేవి. గిరిజనుల పేరు మీద మంజూ రైన రుణాలు, ఇతర పథకాలు దుర్వినియోగం అయ్యేవి. రాజకీయంగా ఎదుగుదల లేకపోవడంతోపాటు వారి సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా మిగిలే వి.

ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, త్వరలో ప్రత్యేక పాలన ప్రారంభం కానుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోతున్నాయి. 

రెండు,మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు

ఆగస్టు 2 నుంచి నూతన గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలకు గ్రామపంచాయతీల భవనాలు గుర్తించాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో ఆయా నూతన  పంచాయతీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వేతర భవనాలు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

రెండు, మూడు రోజుల్లో నివేధికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. నూతన, పాత గ్రామ పంచాయతీల్లని సామగ్రిని సర్దుబాటు చేయడం కోసం అధికారులు సిద్ధమయ్యారు. వచ్చేనెల 2 నుంచి జిల్లాలోని 401గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వస్తాయి.  మూడు గ్రామపంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసి ఒక అధికారిని నియమిస్తారు.  ఈనెల 25వ తేదీ  లోపు నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. 

నారాయణపురం మండలంలో అధికంగా..

సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ప్రస్తుతం 14గ్రామపంచాయతీలు ఉండగా మరో 17 నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో 14 తండాలు ఉన్నాయి. మౌలి క వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూతబడిన ప్రభుత్వ పాఠశాలలో, అద్దె భవనాల్లో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాల ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబం ధించి ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలన చేశారు.

కడపగండితండాలో క మ్యూనిటీ భవనం కానీ, ఇతర ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. తండాలో ప్రభుత్వ భూమి లేదు. సీసీ రోడ్లు లేవు. తండాకు నీరందించడానికి రెండు మంచినీటి ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. మురుగునీటి సరఫరా కోసం ఒక డ్రెయినేజీ మాత్రమే ఉంది. ప్రస్తుతం 14 గ్రామాలకు ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. నూతనంగా 17 పంచాయతీల ఏర్పాటుతో మండలంలో మొత్తం 31 గ్రామాలు కానున్నాయి. మొత్తం ఏడుగురు కార్యదర్శులతో పాలన సాగనుంది. జనగాం గ్రామ కార్యదర్శికి 8 గ్రామాలకు ఇన్‌చార్జి కొనసాగనున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top