రెబల్‌.. గుబులు!

Telangana ZPTC And MPTC Elections - Sakshi

అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు రెబల్‌ అభ్యర్థులు గుబులు పుట్టిస్తున్నారు. ఒక్కో ప్రాదేశిక స్థానానికి ఒకే పార్టీ తరఫున ఐదారుగురు అభ్యర్థులు బరిలో నిలుస్తుండటంతో ఆ రెండు ప్రధాన పార్టీల నేతలు అయోమయంలో పడ్డారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  తొలిదశగా ఏడు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీ, ఏడు జె డ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించిన అధికారులు పరిశీలన ప్రక్రియ కూడా పూర్తిచేశారు. ఈనెల 28న ఉపసంహరణ ఘట్టం కూడా ముగియనుంది. అయితే ఇందుకు మరో రోజు మాత్రమే మిగిలింది. కాగా, ఒక్కో స్థానానికి ఒకే పార్టీ తరఫున పోటీపడుతున్న నాయకులను బుజ్జగించడం నేతలకు కష్టంగా మారింది.

ముఖ్యంగా ఎంపీటీసీలకు ఎన్నడూ లేని విధంగా పోటీ ఏర్పడింది. రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు వెనకడుగు వేస్తున్నా.. కొందరు మాత్రం తప్పనిసరిగా బరిలో ఉంటామని తేల్చిచెబుతున్నారు. పార్టీ ‘బీ’ ఫారం ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటామని హెచ్చరికలు సైతం జారీచేస్తున్నారు. ఇటువంటి వారికి సర్దిచెప్పడానికి పార్టీ నేతల తలబొప్పి కడుతోంది. ఆయా పార్టీల నుంచి  వలసలు జరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నుంచి అధిక సంఖ్యలో ద్వితీయ శ్రేణి, చిన్న నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. గులాబీ కండువా కప్పుకున్న వారికి భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తామని చాలామందిని టీఆర్‌ఎస్‌లోకి లాగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాదేశిక స్థానాలకు టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంతా అయ్యింది. దీనికితోడు పార్టీ పరంగా క్రియాశీలకంగా మెలగని నేతలూ రేసులో ఉన్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటంతో తమకే ‘బీ’ ఇవ్వాలంటున్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేశామని, దీనికి గుర్తింపుగా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు టికెట్లు ఆశించి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.

ఇటువంటి వారిని బుజ్జగించడం గులాబీ నేతలకు అగ్ని పరీక్షగా మారింది. అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలకే రెబల్స్‌ బెడద లేకుండా చూడాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. దీంతో ఎమ్మెల్యేలంతా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒకే రోజు గడువు ఉండటంతో శక్తిమేరకు ప్రయత్నిస్తూనే అవసరం ఉన్న చోట తాయిలాలు, హామీలు గుప్పిస్తున్నారు. కొందరికి డబ్బు ఆశ చూపి పక్కకు తప్పిస్తుండగా.. మరికొందరికి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా కొందరు నేతలు పట్టువీడకపోతుండటంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పదవుల ఎర 
టీఆర్‌ఎస్‌లో మాదిరిగానే కాంగ్రెస్‌కూ రెబల్‌ అభ్యర్థులు తలనొప్పిగా మారారు. అసలే వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న వేళ స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. ఎలాగైనా పూర్వవైభవాన్ని ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటువంటి సమయంలో రెబల్‌ అభ్యర్థుల తీరుతో పార్టీ సతమతమవుతోంది. కొన్ని చోట్ల నాయకులకు పార్టీ జిల్లా పెద్దలు నచ్చజెప్పి బరి నుంచి వైదొలగేలా చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు బెట్టువీడడం లేదు. పార్టీ సంస్థాగతంగా, వచ్చే ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. చివరకు నేతల మాటలకు కట్టుబడి ఉంటారా.. లేదా అనేది ఈనెల 28న తేలనుంది.
 
ఎంపీటీసీలకిలా... 
ఏడు మండలాల్లోని మొత్తం 96 స్థానాలకు టీఆర్‌ఎస్‌ తరఫున 234 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా చేవెళ్లలో బరిలో నిలిచారు. ఈ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలు ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున 46 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. అత్యల్పంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని 10 స్థానాలకు 24 మంది బీఫారం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ ఇదే తరహాలో పోటీ కనిపిస్తోంది. అత్యధికంగా షాబాద్‌ మండలంలోని 15 ఎంపీటీసీలకు 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలోని 10 స్థానాలకు 21 నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారులకు అందాయి.

జెడ్పీటీసీల్లోనూ.. 
ఎంపీటీసీలతో పోల్చుకుంటే జెడ్పీటీసీలకు పోటీ బాగానే ఉంది. కొన్ని స్థానాలకు రెండు మూడు నామినేషన్లు దాఖలుకాగా.. మరికొన్ని మండలాల్లో ఈ సంఖ్య ఆరు వరకు ఉండటం గమనార్హం. టీఆర్‌ఎస్‌ తరఫున మొయినాబాద్‌ జెడ్పీటీసీకి ఆరుగురు పోటీపడుతున్నారు.ఆ తర్వాతి స్థానంలో ఇబ్రహీంపట్నం నిలిచింది. ఇక్కడ ఐదుగురు రేసులో ఉన్నాయి. షాబాద్‌కు మాత్రం ఈ పార్టీ నుంచి ఒక్క నామినేషన్‌ మాత్రమే అందింది. ఇక కాంగ్రెస్‌ తరఫున అబ్దుల్లాపూర్‌మెట్‌ స్థానానికి విపరీతంగా పోటీ కనిపిస్తోంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంచాల, షాబాద్, మొయినాబాద్‌ స్థానాలకు నలుగురు చొప్పున వరుసలో నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top