ఆ 12 సీట్లెవరికి..?

Telangana Elections 2018 TRS Party Pending 12 Seats   - Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్లపై ఆశావహుల్లో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మరో 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సోమ వారం ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫారాలు సైతం పంపిణీ చేస్తారని ఆశావహులు భావిం చారు. టికెట్‌ ఆశిస్తున్న పలువురు ఇదే విషయంపై తెలంగాణభవన్‌కు వచ్చి ఆరా తీశారు. సాయంత్రం వరకు టికెట్లు ఖరారు కాకపోవడం.. మంగళవారం ప్రకటన రావచ్చనే సమాచారంతో వెనుదిరిగారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే కూటమి అభ్యర్థులను ప్రకటించాకే వెల్లడించాలనే వ్యూహంతో ఉన్నారు. ప్రచార షెడ్యూల్‌ విషయంలోనూ కేసీఆర్‌ ఇదే వైఖరితో ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమవుతుండటంతో ప్రచార షెడ్యూల్‌ను మంగళవారం వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

నాంపల్లిలో మార్పు.. : నాంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీఫారం పంపిణీపై ఆసక్తి పెరుగుతోంది. 105 స్థానాల అభ్యర్థుల జాబితాలో నాంపల్లి స్థానానికి ఎం.ఆనంద్‌గౌడ్‌ పేరు ప్రకటించింది. అయితే ఆదివారం ఆయనకు బీఫారం ఇవ్వలేదు. ఈ స్థానంలో సీహెచ్‌.ఆనంద్‌గౌడ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిసింది. నాంపల్లి సెగ్మెంట్‌లో ఒకే పేరుతో ఇద్దరు నేతలు ఉండటం వల్ల సాంకేతికంగా పొరపాటు జరిగిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. మిగిలిన 12 స్థానాల అభ్యర్థులతో కలిపి సీహెచ్‌.ఆనంద్‌గౌడ్‌కు బీఫారం ఇవ్వనున్నట్లు తెలిసింది.

సుధీర్‌రెడ్డికి పార్టీ పదవి.. : మేడ్చల్‌ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. మల్కాజ్‌గిరి ఎంపీ సీహెచ్‌.మల్లారెడ్డికి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యేఎం.సుధీర్‌రెడ్డిని ఈ మేరకు ఒప్పించింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రతిపాదనకు సుధీర్‌రెడ్డి సైతం అంగీకరించారు. దీంతో సుధీర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు.

ఖైరతాబాద్‌లో లొల్లి...
ఖైరతాబాద్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఖరారు ఒకింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్థానాన్ని దానం నాగేందర్‌కు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. తమకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలుసార్లు మంత్రి కేటీఆర్‌ను కోరారు. అభ్యర్థులను ఖరారు చేస్తారనే ప్రచారం జరగడంతో గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులు సోమవారం తెలంగాణభవన్‌కు వచ్చారు. గోవర్ధన్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టికెట్‌ ఇవ్వకుంటే కిరోసిన్‌ పోసుకుంటా: శంకరమ్మ
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌ను తనకు ఇవ్వకుంటే కిరోసిన్‌ పోసుకుంటానని ఈ నియోజకవర్గ ఇన్‌చార్జి శంకరమ్మ అన్నారు. మంగళవారం తనకు టికెట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం నేపథ్యంలో శంకరమ్మ సోమవారం తెలంగాణభవన్‌కు వచ్చారు. అక్కడ ఆమె మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ టికెట్‌ను తనకు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కోరారు. ‘తెలంగాణ కోసం నా బిడ్డ ప్రాణత్యాగం చేశాడు. రేపు నాకు టికెట్‌ ప్రకటించాలి. హుజూర్‌నగర్‌ టికెట్‌ నాకు ఇవ్వకపోతే కిరోసిన్‌ పోసుకుంటాను. ఎన్నారై సైదిరెడ్డికి టికెట్‌ ఇస్తే ఊరుకోను. హుజూర్‌నగర్‌ అభివృద్ధి విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్లక్ష్యం చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు ప్రాధాన్యత ఇచ్చారు..’అని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top