
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా బీజేపీలో చేరిన ఎస్పీ కురువృద్ధుడు నరేశ్ అగర్వాల్.. బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్‌ను ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తనను కాదని ఒక బాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చిందని జయాబచ్చన్‌ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఎస్పీ తనను అవమానించిందని పేర్కొన్నారు. పదవులు ఆశించి బీజేపీలోకి రాలేదని, ఏ బాధ్యత అప్పగించినా తాను నెరవేరుస్తానని నరేశ్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఆయన సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కమలం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
‘బాలీవుడ్‌లో డ్యాన్ చేసే వ్యక్తి’కి టికెట్ ఇచ్చారని నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నరేశ్ అగర్వాల్ సొంత పార్టీ బీజేపీలో చేరినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ.. జయపై ఆయన వ్యాఖ్యలు అనుచితమని, ఆయన వ్యాఖ్యలను ఎంతమాత్రం ఆమోదనీయం కాదని ఆమె తేల్చిచెప్పారు.