అదేమీ అద్భుతం కాదు: సురవరం | Suravaram sudhakar Reddy Said RTC Debts Done By Government | Sakshi
Sakshi News home page

ఆ అప్పులన్నీ ప్రభుత్వం చేసినవే: సురవరం సుధాకర్‌రెడ్డి

Oct 26 2019 12:53 PM | Updated on Oct 26 2019 1:35 PM

Suravaram sudhakar Reddy Said  RTC Debts Done By Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క కలం పోటుతో 48 వేల మంది ఉద్యోగాలు తీసేస్తాం అనడం దారుణమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు శనివారం నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీక్ష చేపట్టిన సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నర్సింగరావు, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితోపాటు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మొదట ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించిన ఆయన పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ ఆఫీసులోనే దీక్షను ప్రారంభించారు.

సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. ఇద్దరు కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా.. మరికొంత మంది గుండె పగిలి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. రూ. 5,000 కోట్ల అప్పు ఉందని ఆర్టీసీని మూసివేస్తామని ముఖమంత్రి కేసీఆర్‌ అనడం సరికాదన్నారు. ఆ అప్పులన్ని ప్రభుత్వం చేసినవేనని, ఆర్టీసీ వారు సొంతంగా చేసినవి కాదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదని, ప్రజా రవాణా రంగమని ఆయన పేర్కొన్నారు. 

ఉప ఎన్నికల్లో గెలవడం అద్భుతం కాదు.
నష్టాలు వచ్చినా.. లాభాలు వచ్చిన ప్రజా రవాణా వ్యవస్థను నిరంతరం నడపాల్సిందేనని సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డిజిటల్ పన్నులు వేయడం వలన ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారు కదా.. మరి తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం  చేయాలని డిమాండ్‌ చేశారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలిస్తే చేసిన తప్పులు అన్ని మాఫీ అయిపోతాయా అని నిలదీశారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం పెద్ద అద్భుతం కాదని విమర్శించారు. నిరవధిక నిరాహార దీక్ష విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని సురవరం సుధాకర్‌ రెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement