
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వానికి అంత తొందరెందుకని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ చట్టం మంచిదే అయినప్పటికీ కఠిన నిబంధనల వల్ల చట్టం ఉద్దేశం నెరవేరదన్నారు. బుధవారం మఖ్దూం భవన్‌లో చాడ వెంకటరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ట్రిపుల్ తలాక్‌కు సీపీఐ ఎప్పుడూ వ్యతిరేకమేనని, బిల్లులోని మూడేళ్ల జైలు శిక్ష ఒక మతం వారికే అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు. మహారాష్ట్రలో బుధవారం జరిగిన బంద్‌కు సీపీఐ మద్దతు ఇచ్చిందన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్టు దళితుల అణచివేతలో ఒక భాగమని విమర్శించారు.
పవన్ కల్యాణ్‌కు ఇక్కడేం పని: చాడ
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పవన్ కల్యాణ్‌కు ఇక్కడ ఏమి పనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై పవన్‌కు అవగాహన లేదని, ఆయన ఒక సినీ నటుడు మాత్రమేనని విమర్శించారు.