భారీ జన సమీకరణ! | Sakshi
Sakshi News home page

భారీ జన సమీకరణ!

Published Tue, Sep 11 2018 1:54 AM

State BJP doing the exercise for huge public meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఎన్నికల శంఖారావ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌లో ఈనెల 15న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరు కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 1 నుంచే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. ఇటీవల మంత్రాలయం పర్యటనకు వచ్చిన అమిత్‌షా.. పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల శంఖారావ సభలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 15న సభ నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. తాను హాజరవుతానని, రాష్ట్రంలో స్వయంగా పార్టీ కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు ఈనెల 4న మహబూబ్‌నగర్‌లో ప్రత్యేకంగా పార్టీ ఎన్నికల శంఖారావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.

అలాగే పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు ఇప్పటికే పలుమార్లు మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. తాజాగా సోమవారం కూడా సమావేశ ఏర్పాట్లపై జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మార్పు కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన జారీ చేసేంత వరకు అభ్యర్థులను ప్రకటించబోమని చెప్పారు. రాజకీయాల్లో అనిశ్చితి, గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్, జోగుళాంబ, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.  

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి
వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించేందుకు అవసరమైన కార్యాచరణపైనా దృష్టి సారించారు. అమిత్‌షా రాష్ట్ర ఎన్నికలపై శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పార్టీ నేతలను గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. పార్టీ వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసేలా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. సొంతంగానే తాము పోటీ చేస్తామని చెబుతున్నా.. పొత్తులకు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై, పొత్తులపై స్పష్టతను అమిత్‌షా మహబూబ్‌నగర్‌ సమావేశం సందర్భంగా ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నెల 11న రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ కూడా మంగళవారం పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అలాగే పార్టీ మెనిఫెస్టో కమిటీ కూడా మంగళవారం సమావేశం కానుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement