డిష్యుం..డిష్యుం | SOmireddy Chandramohan Reddy And Narayana Fighting Between Domination | Sakshi
Sakshi News home page

డిష్యుం..డిష్యుం

Aug 16 2018 2:10 PM | Updated on Aug 16 2018 2:13 PM

SOmireddy Chandramohan Reddy And Narayana Fighting Between Domination - Sakshi

అధికారపార్టీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటికే మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సాగుతున్న వార్‌ అన్ని నియోజకవర్గాలకు పాకింది. పర్యవసానంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ముఖ్యంగా కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో రగడ యథాతథంగా కొనసాగుతోంది. ఈక్రమంలో అన్నింటిని సమన్వయం చేసుకోవాల్సిన జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పూర్తిగా పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సమస్య తీవ్రత పెరిగి అందరూ అధిష్టానం వద్ద తాడోపెడో తెల్చుకోవటానికి క్యూకడుతున్నారు. మొత్తం మీద జిల్లాలో అధికారపార్టీ గ్రూప్‌ వివాదాలు నేతలకు తలనొప్పిగా, ఆశావాహులకు కొత్త చికాకులు తెచ్చేలా ఉండడం గమనార్హం. ఇక ఇన్‌చార్జ్‌ మంత్రి కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డికి టిక్కెట్‌ నీదే అని భరోసా ఇవ్వడంతో అన్ని నియోజకవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా అధికారపార్టీలో రోజుకో కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే మంత్రులు సోమిరెడ్డి, నారాయణ మధ్య ఆధిపత్యపోరు సాగుతుండగా సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి మధ్య కూడా వార్‌ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో పలు నియోజకవర్గాల్లో సమస్యలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో పాత, కొత్త నేతల రగడ గత కొన్ని నెలలుగా సాగుతోంది. పార్టీ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వర్గం తమకి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బూత్‌ కమిటీల్లో చోటు కల్పించలేదని, పూర్తిగా పార్టీలో కొత్తగా వచ్చిన వారినే నియమించారని సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా పార్టీలో కోవూరు చర్చ సాగుతూనే ఉంది. దీంతో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎమ్మెల్యే పోలంరెడ్డి నివాసానికి వెళ్లి టిక్కెట్‌ ఆయనకేనని ప్రకటించి బాగా పనిచేయాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తమను కూడా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడంతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కర్నూలులో మంత్రి లోకేష్‌ ఇదే తరహాలో ప్రకటిస్తే అక్కడి నేతలు నేరుగా ప్రశ్నించిన తరుణంలో పార్టీ అధిష్టానాన్ని కాదని మంత్రి, ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఎలా ప్రకటిస్తారనే చర్చ సాగుతోంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వెంకటగిరిలో వార్‌
వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారద మధ్య వార్‌ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే చేనేత దినోత్సవం రోజున చేనేత మహిళ అయిన శారదను ఎమ్మెల్యే అవమానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే స్థానికంగా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలుస్తోంది. ఇక ఆత్మకూరు వ్యవహారం కూడా గత కొంతకాలంగా అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా గతంలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కన్నబాబు పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్ష నిర్వహించడంపై పార్టీ కొంత సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆత్మకూరు టిక్కెట్‌ను ఆశిస్తూ అక్కడ పార్టీ నేతలు మెట్టకూరు ధనుంజయ్‌రెడ్డి, కన్నబాబు, విజయరా>మిరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య తదితర పేర్లు తెరపైకి వచ్చి ఎవరిస్థాయిలో వారు స్థానికంగా మంత్రుల సహకారంతో యత్నాలు సాగిస్తుండడంతో క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.

బీద తీరుపై అసమ్మతి
ఇదిలా ఉంటే నియోజకవర్గాల్లో సమస్యలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్రపై పార్టీ రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు నెలలుగా మూడు నియోజకవర్గాల్లో రగడ సాగి అధిష్టానం వరకు ఫిర్యాదులు వస్తున్నా స్థానికంగా స్పందిచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డితో వెళ్లి కోవూరు వ్యవహారం చక్కదిద్దకుండా ఎమ్మెల్యేకు భోరోసా ఇవ్వడాన్ని పార్టీ అధిష్టానానికి కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో కొత్త పంచాయతీకి తెరలేచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement