ఓటర్ల జాబితా వ్యవహారంపై ఈసీకి నోటీసులు

SC notices to EC, Telangana govt on voters list - Sakshi

వారంలోపు జవాబు ఇవ్వాలని ఆదేశం

రెండు వేర్వేరు పిటిషన్లపై సుప్రీం ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికల కోసం ఓటు హక్కును పణంగా పెట్టడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీటిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీచేసింది. తమకు 18 ఏళ్లు నిండినప్పటికీ 2018 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవడంతో తాము ఓటు హక్కు కోల్పోతున్నామని, తమకు ఓటు హక్కు లభించే స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన వాతావరణం ఉండాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమని పిటిషనర్లు పోతుగంటి శశాంక్‌రెడ్డి, ఆర్‌.అభిలాష్‌రెడ్డి ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

అలాగే తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అంతకుముందే ఆగస్టు 28న, జనవరి 1, 2019ని అర్హత తేదీగా పేర్కొంటూ జారీచేసిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసిందని, తిరిగి 2018 జనవరి 1ని అర్హత తేదీగా పేర్కొంటూ సెప్టెంబరు 8న స్వల్పకాల ఓటరు నమోదు షెడ్యూలును జారీచేసిందని, ఈ ప్రకారం ఓటర్ల నమోదుకు, సవరణకు, లోపాలు సరిదిద్దడానికి తగిన సమయం లేనందున పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి మరొక పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

పోతుగంటి శశాంక్‌రెడ్డి తరపున న్యాయవాదులు నిరూప్‌రెడ్డి, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా మంత్రిమండలి ముందస్తుగా శాసనసభను రద్దు చేస్తూ సిఫారసు చేయడంపై సమీక్షించాలని కోరారు. ఏ అత్యవసర పరిస్థితి లేకున్నప్పటికీ, సభ అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే ఇలా సభను రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదించారు. అధికార పార్టీకి సానుకూల సమయమని చెప్పి ఓటర్ల నమోదుకు 2018 జనవరి 1ని అర్హత తేదీగా ప్రకటించినందున స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించినట్టు కాదని పేర్కొన్నారు.

‘ఎన్నికల సంఘం వక్రభాష్యం చెబుతోంది..’
త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావించి లక్షలాది మంది ఓటు హక్కును పణంగా పెడితే అది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నిక ఎలా అవుతుందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ కూడా విచారణకు వచ్చింది. గుజరాత్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర ఎన్నికల సంఘం వక్రభాష్యం చెబుతోందని, అసెంబ్లీ రద్దయినప్పటికీ ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పని లేదని, ఆర్టికల్‌ 324 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం విశేష అధికారం కలిగి ఉందన్నారు.

కొత్త షెడ్యూలు ప్రకారం తగిన సమయం లేనందున పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దాదాపు 60 లక్షల ఓటర్ల వివరాల్లో అవకతవకలు ఉన్నాయని విన్నవించారు. ఈ రెండు పిటిషన్లను పరిశీలించి, వాదనలు విన్న ధర్మాసనం వారంలోగా కౌంటర్‌ దాఖలు కోరుతూ నోటీసులు జారీచేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top