రాజస్తాన్‌ రాజకీయం: సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు

Sachin Pilot Says 25 MLAs With Me And We Do Not Attend CLP Meeting - Sakshi

102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది: సీఎం గహ్లోత్‌

సీఎం అశోక్‌ గహ్లోత్‌ చెప్తున్నదంతా అబద్ధం: సచిన్‌

జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయం రసకందాయంలో పడింది. జైపూర్‌లో జరిగే కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీలో పాల్గొనేది లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మాటలు అబద్ధమని అన్నారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. గహ్లోత్‌కు 102 ఎమ్మెల్యేల మద్దతు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్‌ వెల్లడించారు. అంతకుముందు సీఎల్పీ భేటీలో పాల్గొనేందుకు 102 మంది ఎమ్మెల్యేలు సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసానికి చేరుకున్నారని కాంగ్రెస్‌ తెలిపింది. రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆకాక్షించారు.

కాషాయదళం ఎత్తులు సాగనీయమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో విభేదాలు తలెత్తితో అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సుర్జేవాలా సూచించారు. సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌లో ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, ఆయన వెనక్కి తిరిగి రావాలని కోరారు. కాగా, తొలుత సోమవారం ఉదయం 10.30 గంటలకు అనుకున్న సీఎల్పీ భేటీని మధ్యాహ్నానానికి వాయిదా వేశారు. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, సీఎల్పీ భేటీ అనంతరం రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
(చదవండి: ‘సచిన్‌ పైలట్‌ కార్యాలయం మూసివేత)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top