కూటమి పేరిట డ్రామాలు

Ram Madhav Comments on Mahakutami - Sakshi

కాంగ్రెస్, టీడీపీలపై బీజేపీ నేత రాంమాధవ్‌ ధ్వజం  

చంద్రబాబు టీడీపీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడిచారు

భైంసా/భైంసాటౌన్‌(ముథోల్‌): కాంగ్రెస్, టీడీపీలు కూటమి పేరిట డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ విమర్శించారు. భైంసాలో బీజేపీ అభ్యర్థి రమాదేవి నామినేషన్‌ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు తిరస్కరించారని, ప్రస్తుతం తామే ప్రత్యామ్నాయం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహాకూటమి పేరిట వచ్చి ప్రజల బతుకులతో ఆడుకునేందుకు మరోసారి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు ఎన్టీఆర్‌ కంకణం కట్టుకుంటే.. చంద్రబాబు ఆ పార్టీ చంకనెక్కి కూర్చున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తన సీటును కాపాడుకోలేని చంద్రబాబు.. దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ జేబులో టీడీపీ ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ టీడీపీ చంకలో ఉందని ఎద్దేవా చేశారు. పక్కనే గోదావరి నది ఉన్నా తాగు, సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తీరాలంటే బీజేపీ గెలవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

తెలంగాణ గళమెత్తింది బీజేపీయే 
తెలంగాణ గళమెత్తింది మొదట బీజేపీయేనని రాంమాధవ్‌ అన్నారు. 1997 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం తామే తెచ్చామని భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల గద్దె దిగిందని విమర్శించారు. ఐదేళ్లు పాలన చేతకాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కరుడు గట్టిన మతతత్వ పార్టీ ఎంఐఎంతో దోస్తీ పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని దిగజారుస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top