ప్యాకేజీయే లాభమని చంద్రబాబు అన్నారు

Rajnath Singh About Chandrababu Naidu On Special Status - Sakshi

‘హోదా’పై రాజ్యసభలో చర్చకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సమాధానం   

సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీవల్లే ఎక్కువ లాభమని, హోదా సంజీవని కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీలో చెప్పారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. రైల్వే జోన్‌ ఏర్పాటుచేసి తీరుతామని తొలిసారి స్పష్టంచేశారు. రాజ్యసభలో మంగళవారం ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు’ అంశంపై 4 గంటలపాటు జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలన్నింటినీ పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రస్తుత ప్రధాని ఇచ్చిన హామీలనే కాదు, మాజీ ప్రధాని మన్మోహన్‌ ఇచ్చిన హామీలనూ మా ప్రభుత్వం అమలు చేస్తుంది. సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. వాటన్నింటినీ మా ప్రభుత్వం అమలు చేస్తోంది.. 90% హామీలను పూర్తిచేశాం. మిగిలినవి కూడా పూర్తిచేస్తాం. కడప, బయ్యా రం స్టీలు ప్లాంటు, రైల్వేజోన్‌ తదితర ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను తేల్చి కమిటీ నివేదిక ఇస్తుందని చట్టంలో ఉంది. వాటిని ఏర్పాటుచేయాలని స్పష్టంగా ఉంటే వేరే రకంగా ఉండేది. చట్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసేందు కు కట్టుబడి ఉన్నాం. రైల్వేజోన్‌ ఏర్పాటుచేసి తీరుతాం. 

రికార్డు సమయంలో పోలవరం పూర్తి 
2014లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ నుంచి 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ. 6,754 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టును తామే నిర్మిస్తామన్న ఏపీ విజ్ఞప్తిని ఆమోదించాం. దీనిని రికార్డు సమయంలో పూర్తిచేస్తామని భరోసా ఇస్తు న్నాను. రాష్ట్రానికి హోదా ఇస్తామన్న అప్పటి ప్రధాని మన్మోహన్‌ నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అయితే.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు విరుద్ధంగా వచ్చా యి. ఈ అంశంపై ఆర్థికమంత్రి స్పష్టత ఇచ్చారు.  

ప్యాకేజీకి సీఎం అంగీకరించారు 
హోదా కంటే ప్యాకేజీవల్లే ఎక్కువ లాభమని చంద్రబాబే చెప్పారు. ఆయనతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రం సమ్మతితో హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటును ఐదేళ్లకు రూ.22,123 కోట్లు సిఫారసు చేసింది. ఈ నిధులను ఇస్తూనే ఉన్నాం. హోదా ఉంటే కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి ఎంత వస్తుందో ఆ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ అంతరం ఏటా రూ.3,200 కోట్లు ఉంటుందని లెక్కించారు.

ఈ నిధులను ఎక్స్‌టెర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చి వాటిని కేంద్రం చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. సెప్టెంబర్‌ 2016లో దీనికి సీఎం సమ్మతి తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి, సీఎం కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా దీనిని స్వాగతించారు. ఏపీ సీఎం తొలుత ఈఏపీల రూపంలో నిధులు స్వీకరించేందుకు సమ్మతించి.. తర్వాత వేరే రూపం లో ఇవ్వాలన్నారు. దాని వల్ల ఇబ్బందులున్నాయని, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. కానీ, రాష్ట్రం స్పందించలేదు. ఇక తెలంగాణ, ఏపీ సీఎంలు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ రాష్ట్రాలకు నెరవేర్చాల్సిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని రాజ్‌నాథ్‌ చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top