రాజన్న రాజ్యానికే రాజంపేట మద్దతు

Rajampet Electoral Review - Sakshi

రాజంపేట నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్‌ హయాంలో శాశ్వత అభివృద్ధి జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు కొండూరు ప్రభావతమ్మ, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. తాగు, సాగునీటి ప్రధానసమస్యలను తీర్చారు. అటువంటి రాజంపేటలో మళ్లీ రాజన్న రాజ్యానికే మద్దతు పలకనున్నారు. ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి తనదైనశైలిలో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశారు. 1952–55 కాలంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు.

1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పంజం నరసింహారెడ్డి , కాంగ్రెస్‌ తరఫున పోలా వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికలలో పార్థసారథి, పీవీ సుబ్బయ్య కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి చెరో 40వేలకుపైగా ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు. 1962లో  స్వతంత్ర అభ్యర్థిగా కొండూరు మారారెడ్డి 14,335 ఓట్లు సాధించి కాంగ్రెస్‌ అభ్యర్థి పార్థసారథిపై విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా బండారు రత్నసభాపతి 35,845 ఓట్లతో గెలుపొందారు. 1972లో రెండోసారి కూడా ఈయన గెలుపొందారు. 1997 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండూరు ప్రభావతమ్మ గెలుపొందారు. 1978లోరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రభావతమ్మ పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సభాపతిపై విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత  ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ రాజంపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రభావతమ్మ, టీడీపీ అభ్యర్థి సభాపతిపై గెలుపొందారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టం. 1989లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కని ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కె.మదన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరఫున పసుపులేటి బ్రహ్మయ్య గెలుపొందారు. 2004 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్య పై సుమారు 24వేల ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి 12వేల మెజారిటీతో గెలుపొందారు. ఆతర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆకేపాటి గెలుపొందారు. 2014లో మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన మల్లికార్జున రెడ్డి పార్టీలో చేరారు. 

బరిలో స్థానికేతరుడు
టీడీపీ నుంచి ఈసారి రైల్వేకోడూరుకు చెందిన బత్యాల చెంగల్రాయుడును చంద్రబాబు బరిలోకి దింపారు. రాజంపేటకు ఎలాంటి సంబంధంలేని ఈయనపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. స్థానిక  నాయకత్వాన్ని కాదని బత్యాలను పోటీకి దింపారు. ఈ సారి ఎన్నడూలేని రీతిలో సామాజికవర్గరాజకీయాలు రాజంపేటలో రాజ్యమేలుతున్నాయి. 

మేడా వైపే.. 
రాష్ట్ర విభజన అనంతరం రాజంపేట తొలి ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా రాజంపేటలో అభివృద్ధికి పెద్దపీట వేశారు.  ఆంధ్ర భద్రాద్రిగా రామాలయానికి అధికారిక గుర్తింపుతోపాటు టీటీడీలో విలీనం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలను తీసుకొచ్చి జలకళను తెప్పించారు. పేదలకు ముఖ్య మంత్రి సహాయ నిధిని ఇప్పించడంలో కృషి చేశారు. నందలూరు మండల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. నిరంతరం ప్రజలసమస్యలను పరిష్కరించడంలో ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషిచేశారు.
– మోడపోతుల రామ్మోహన్, సాక్షి, రాజంపేట

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top