జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌గా రాజగోపాల్‌

Rajagopal as jaggaiahpeta Municipal Chairman - Sakshi

ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

ఫలించని తెలుగుదేశం నేతల కుట్ర

జగ్గయ్యపేట/జగ్గయ్యపేట అర్బన్‌:  అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా జగ్గయ్యపేట మున్సిపాలిటీలో న్యాయమే గెలిచింది. మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని మరోమారు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా ఇంటూరి రాజగోపాల్‌ (చిన్నా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండురోజుల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. వాస్తవానికి చైర్మన్‌ ఎన్నికను శుక్రవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు కౌన్సిల్‌ హాల్లో అరాచకంగా వ్యవహరించడంతో ఎన్నికల అ«ధికారి, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హరీశ్‌ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో శనివారం పూర్తి బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. టీడీపీ నాయకులు శుక్రవారం వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకుని పోడియం చుట్టూ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల సీట్ల మధ్య కంచె ఏర్పాటుచేశారు.

ఉదయం 10 గంటలకే వైఎస్సార్‌సీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాల్‌కు చేరుకున్నారు. 11 గంటల సమయంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, టీడీపీ కౌన్సిలర్లు వచ్చారు. నేరుగా ఎన్నికల అధికారి హరీశ్‌ ఉన్న పోడియం వద్దకు వెళ్లారు. తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశారని, వారు వచ్చేవరకు ఎన్నికను వాయిదా వేయాలంటూ మరోమారు ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే కోరం ఉన్నందున ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాము ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు బయటకు వెళ్లిపోయారు.

అనంతరం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. చైర్మన్‌ అభ్యర్థిగా ఇంటూరి రాజగోపాల్‌ (చిన్నా)ను ప్రతిపాదిస్తున్నట్లు 10వ వార్డు కౌన్సిలర్‌ మహ్మద్‌ అక్బర్‌ చెప్పగా, 3వ వార్డు కౌన్సిలర్‌ జన్నుమహంతి అనంతలక్ష్మి బలపరుస్తున్నట్లు చెప్పటంతో చైర్మన్‌గా చిన్నా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనతో ప్రమాణస్వీకారం చేయించి, నియామకపత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నిక ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ కె.విజయన్, జేసీ–2 పి.బాబూరావు పర్యవేక్షించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top