వాగ్దానాల ఫాంటసీలు..

Promises fantasies in telangana elections 2018 - Sakshi

పన్నెండేళ్లొచ్చినా మా బుజ్జిగాడికి రోజూ రాత్రిపూట కథ వినే అలవాటు పోలేదు. ఆరోజు కూడా కథ చెప్పమని వేధిస్తోంటే.. ఆ పూట మా కాలనీలో జరిగిన రాజకీయ నాయకుల ప్రచారం ఆధారంగా అప్పటికప్పుడు ఓ కథ అల్లాను. ‘ఇది ఫాంటసీ కథరా’ అంటూ మొదలుపెట్టాను.

అనగనగా ఓ వీధి. ఆ వీధిలో పక్కపక్కనే కొన్ని దుకాణాలు. ఒక రోజు అక్కడికి కొంతమంది అభ్యర్థులు వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, రోజూ రాత్రిపూట షాపులన్నీ మూసేసి అందరూ వెళ్లిపోయాక, అర్ధరాత్రి దాటాక దుకాణాల్లోని రకరకాల వస్తువులన్నీ ప్రాణం పోసుకుంటాయి. అవన్నీ సూక్ష్మరూపం ధరించి బయటకు వస్తాయి. వీధి చివర ఉన్న నల్లా కాడ చేరి పిచ్చాపాటి కబుర్లన్నీ చెప్పుకుంటుంటాయి.

కూరగాయల కొట్లోని తరాజు ఇలా మాట్లాడింది– ‘‘ఇవాళ మా షాపు దగ్గరకు వచ్చిన అభ్యర్థి నా సాయంతో కూరగాయలు జోకి చాలామంది బుట్టల్లో వేశాడు. తన గుర్తును గుర్తుపెట్టుకొమ్మని నోటితో చెబుతూనే ఆ బుట్టల్లో కొన్ని పాంఫ్లెట్లు వేశాడు. నిజానికి అతడు అందరి కడుపులూ నిండేలా అన్నం, కూరలూ దొరికేలా ప్రణాళికలు రచించాలి. ఆ పనులన్నీ చేయడం కష్టం కదా. అందుకే కాసేపు కడుపులు నింపే కూరగాయల్ని అందరి సంచుల్లోకి వేస్తూ హడావుడి చేస్తాడు. మళ్లీ ఐదేళ్లదాకా పత్తా ఉండడు’’ అంది తరాజు. వెంటనే నల్లా నోరుతెరిచింది. ‘‘అవును.. మొన్న ఒకడు నా కింద నిలబెట్టి ఓటరుకు స్నానం చేయించాడు. అందరికీ మంచినీళ్లందించడం చేతగాకే, ఈ చెయ్యి తడిపే పనులు..’’ అంది.  
ఇంకా ఇస్త్రీపెట్టె, పాలపాకెట్ల బాక్సు, బార్బర్‌షాపు కత్తెరా.. ఇవన్నీ తమ షాపుల్లో జరిగిన విన్యాసాలను ఎగతాళిగా నవ్వులాటగా చెప్పుకుంటూ ఉండగా.. ‘‘ఎక్కడైనా వీధి నల్లా, తరాజు, కత్తెరా దువ్వెనలు మాట్లాడుకుంటాయా?’’ అంటూ నా కథకు బ్రేకులేస్తూ అడిగాడు బుజ్జిగాడు. వాణ్ణి గదమాయిస్తూనే నేను ఆలోచనలో పడిపోయా. ఫాంటసీ అంటూ మొదలుపెట్టినా చిన్న కుర్రాడు కథను నమ్మడం లేదు. కానీ పెద్దలైన మేం మాత్రం ఈ అభ్యర్థులు విచిత్ర విన్యాసాలు చూస్తూ. వాటిని ఎంజాయ్‌ చేస్తూ వాళ్లు చెప్పే కతలు ఎలా నమ్ముతున్నాం. ఫ్యాంటసీలకు మించిన వాళ్ల వాగ్దానాలెలా విశ్వసిస్తున్నాం? చిన్నవాళ్లకు ఉన్న లాజిక్‌ కూడా ఎప్పుడో ఓటుహక్కు వచ్చిన మా పెద్దాళ్లకు ఎందుకుండటం లేదు?. చిత్రం కదా!.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top