విశ్వసనీయతకు పట్టం

Prakasam YSRCP Leaders Profiles - Sakshi

జిల్లాకు ఇద్దరు మంత్రులు

వైఎస్‌ జగన్‌ క్యాబినెట్‌లో బాలినేని, సురేష్‌కు చోటు

మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం

పార్టీ ముఖ్య నేతల నుంచి ఫోన్‌

జిల్లాలో సంబరాలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సీఎం వైఎస్‌ జగన్‌ క్యాబినెట్‌లో ప్రకాశం జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విజయపథాన నడిపిన  పార్టీ ఒంగోలు పార్లమెంట్‌అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అందరూ అనుకున్నట్లుగానే  వైఎస్‌ జగన్‌ క్యాబినెట్‌లో  మంత్రి పదవి వరించగా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు సైతం క్యాబినెట్‌లో  చోటుదక్కింది. బాలినేని, సురేష్‌లు శనివారం వెలగపూడి లోని సచివాలయం ప్రాంగణంలో  జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఎన్నికైనట్లు పార్టీకి చెందిన ముఖ్య నేతలు బాలినేని, సురేష్‌లకు శుక్రవారం రాత్రి ఫోన్‌ ద్వారా తెలిపారు. బాలినేనికి మంత్రి పదవి వచ్చిందని తెలియగానే వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతోపాటు కొత్తపట్నం మండలంలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఏర్పాటు చేసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకోగా సురేష్‌కు మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

జిల్లాకు చెందిన ఇద్దరికి జగన్‌ క్యాబినెట్‌ లో చోటుదక్కడంతో  పార్టీ శ్రేణులు జిల్లాలో  పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. నేతలు కార్యకర్తలు రెట్టించిన ఆనందంలో  కేకులు, స్వీట్లు పంచడంతోపాటు బాణ సంచా పేల్చారు. శనివారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి బాలినేని అభిమానులతో పాటు సురేష్‌ అభిమానులు పార్టీ నేతలు విజయవాడకు తరలి వెళ్లారు. బాలినేని రెండవసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా సురేష్‌కు  తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఎన్నికల సమయంలోనే  వైఎస్‌ జగన్‌.. బాలినేనికి మంత్రి పదవి ప్రకటించారు.  చెప్పినట్లుగానే పదవి ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ తో బాలినేనికి బంధుత్వం ఉన్నా అంతకంటే మిన్నగా జగన్‌తో కలిసి నడిచారు. ఆయనకు తలలో నాలుకలా ఉంటూ పార్టీ అభివృద్దికి కృషి చేశారు. వైఎస్‌ రెండవసారి సీఎం అయ్యాక  బాలినేనికి మంత్రి పదవి లభించింది. వైఎస్‌ మరణానంతరం కొద్దికాలం రోశయ్య క్యాబినెట్‌లో మంత్రిగా చేశారు బాలినేని. ఆ తరువాత కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన బాలినేని..జగన్‌ తో కలిసి నడిచారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా..
12–12–1964 లో టంగుటూరు మండలం కొణిజేడులో బాలినేని వెంకటేశ్వరరెడ్డి, రమాదేవి దంపతులకు జన్మించిన బాలినేని బీకాం చదివారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శిగాను, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగాను బాధ్యతలు నిర్వహించారు. 1999లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావుపై 1999లో, శిద్దా రాఘవరావుపై 2004లో, ఈదర హరిబాబుపై 2009లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. వైఎస్సార్‌ రెండో క్యాబినెట్‌లో చోటుదక్కింది. దీంతో ఆయన 2009 మే 29న భూగర్భగనుల శాఖ, చేనేత జౌళిశాఖ, చిన్న తరహా పరిశ్రమల శాఖామంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  2009 సెప్టెంబర్‌ 2న ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ దుర్మరణం చెందడంతో ఆ తరువాత బాలినేని మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్‌.జగన్‌తో కలిసి నడిచారు.

విశ్వసనీయతకు మారుపేరు
రాజకీయంగా తనకు కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేను, మంత్రిగాను హోదా కల్పించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల ఆదినుంచి బాలినేని విశ్వాసం కనబరుస్తూ వచ్చారు. ఒక వైపు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ దశలో ఓదార్పు యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మంత్రులు ఎవరు పాల్గొనరాదంటూ అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఆంక్షలు విధించినా ఖాతరు చేయలేదు. వైఎస్సార్‌ తరువాత ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కూడా బాలినేని మంత్రిగానే ఉన్నప్పటికీ ఓదార్పు యాత్రలో పాల్గొనకూడదంటూ ఆంక్షలు పెరిగిపోయాయి. ఓదార్పుయాత్ర చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న బాలినేని 2010లో తన మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో ఒక్కసారి మాత్రమే టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌రావు చేతిలో ఓటమి చెందిన ఆయన తిరిగి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌రావుపై 22 వేల పైచిలుకు ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.

ఐఆర్‌ఎస్‌ నుంచి.. మంత్రి దాకా సురేష్‌ పయనం..
ఐఆర్‌ఎస్‌ ఉద్యోగం చేస్తున్న డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ 2009లో దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ సమయంలో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా యర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది. ఈ తరుణంలో సురేష్‌కు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు ఇచ్చి వైఎస్సార్‌ ప్రోత్సహించారు. తొలిసారిగా పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుపై దాదాపు 13,565 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్సార్‌ మృతి చెందిన తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సురేష్‌కు టికెట్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి విజయకుమార్‌పై 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందిన పాలపర్తి డేవిడ్‌రాజు పార్టీ ఫిరాయించడంతో సురేష్‌ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆయన గతంలో వచ్చిన మెజార్టీని అధిగమించి 31,096 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. తాజాగా వైఎస్‌ జగన్‌ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top