పెనుగొండ ఎంపీపీ సురేఖ రాజీనామా

Penugonda MPP Surekha Resign West Godavari - Sakshi

ప్రతి దానికీ పితాని ఇబ్బంది పెట్టారు

అందుకే ఎంపీపీ పదవికి రాజీనామా చేశా

పెనుగొండ ఎంపీపీ సురేఖ

పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : ‘దళిత మహిళను కాబట్టే నాకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడినా మంత్రి పితాని అధికారంతో ఏ పనులూ చేయలేకపోయా, అవమానం భరించలేక, అడుగడుగునా మంత్రి పితాని అడ్డుపడటంతోనే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నాను’ ఇవి అధికార పార్టీకి చెందిన పెనుగొండ మండల ఎంపీపీ సురేఖ వ్యాఖ్యలు. తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెనుగొండ మండల ఎంపీపీ పదవి వివాదం రాజీనామా వరకు వెళ్లింది. పెనుగొండ ఎంపీపీగా ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉండే సురేఖకు పార్టీ నాయకులు పగ్గాలు అందించారు. అయితే చివరి నిమిషంలోటీడీపీలో చేరిన పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించి అనంతరం మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ సురేఖ పితాని వర్గం కాకపోవడంతో మరో వ్యక్తిని ఎంపీపీగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు.

ఈ నేపథ్యంలో సురేఖ ఎంపీపీగా రెండున్నరేళ్లు, పితాని వర్గం వ్యక్తి మరో రెండున్నరేళ్లు ఎంపీపీగా కొనసాగుతారనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో రెండున్నరేళ్ల అనంతరం సురేఖను రాజీనామా చేయించి పితాని వర్గం వ్యక్తికి ఎంపీపీ పదవి అప్పగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సురేఖ వినకుండా నాలుగు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఇక చేసేది లేక మంత్రి పితాని సురేఖపై అవిశ్వాసం అస్త్రం ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సురేఖ నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్‌ సీఈఓ నాగార్జునాసాగర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి, రాష్ట్ర నాయకులు కళా వెంకట్రావుకు, అయ్యన్నపాత్రుడుకి చెప్పానని, అయినా మంత్రి మాటకే పెద్దపీట వేసి తన మాటను ఏమాత్రం పట్టించుకోలేదని సురేఖ వాపోయారు.

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దళితురాలిని, మంత్రి పితాని వర్గం మనిషి కాకపోవడంతో అధికారులెవరూ తనకు సహకరించలేదని ఆమె తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు అడుగడునా మంత్రి అడ్డుతగులుతూనే ఉన్నారని ఆమె వాపోయారు. ప్రొటోకాల్‌ ప్రకారం వడలి పశుశుల ఆసుపత్రి నిర్మాణంలో శిలాఫలకంపై పేరు వేయకపోవడంతో ఆందోళన చేసి పేరు వేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనీ, పెన్షన్లు ఇవ్వాలన్నా దళిత మహిళనని పితాని తనమాటను చెల్లుబాటు కానీయలేదని సురేఖ పేర్కొన్నారు. నాయకులెవరూ సహాయం చేయకున్నా టీడీపీలోనే కొనసాగుతానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top