పరకాల రాజీనామా

Parakala Prabhakar resign to the State Government Advisor post - Sakshi

     రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి గుడ్‌బై

     మరో 15 రోజుల్లో ముగియనున్న పదవీకాలం

     ఈ తరుణంలో ప్రతిపక్ష నేతపై నెపం వేసేలా వ్యూహం

     బాబు ఢిల్లీ యాత్రతో బండారం బట్టబయలు

     బహిర్గతమైన టీడీపీ–బీజేపీ అనుబంధం

     అది కప్పిపుచ్చుకునేందుకే పరకాలతో రాజీనామా

సాక్షి, అమరావతి:  ఢిల్లీ కేంద్రంగా బీజేపీతో లాలూచీ వ్యవహారం బట్టబయలు కావడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ రాజీనామా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ఆరోపణల వల్లే పరకాల రాజీనామా చేసినట్లు చెప్పుకోవడం ద్వారా బీజేపీ–టీడీపీ లాలూచీపై వ్యక్తమవుతున్న విమర్శల నుంచి కొంతవరకైనా తప్పించుకోవచ్చని, ప్రజల దృష్టిని కూడా మరల్చవచ్చనేది చంద్రబాబు వ్యూహమని తెలిసిపోతోంది.

పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించి  రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. ప్రతిపక్ష నాయకులు తనపై ఆరోపణలు చేస్తుండడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పరకాల పేర్కొన్నారు. ఒకపక్క రాష్ట్ర హక్కుల సాధన కోసం బీజేపీ, కేంద్రంతో పోరాడుతూ మరోవైపు తనను సలహాదారుగా కొనసాగించటంపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రెండు మూడు రోజులుగా కొందరు నేతలు దీని గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం తనను బాధించిందన్నారు. తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదించాలని ప్రయత్నించడం, తెరవెనుక మంతనాలు, బేరసారాలకు సీఎం వీటిని వినియోగిస్తున్నారని విపక్ష నేత ఆరోపించారన్నారు. మరోవైపు పరకాల రాజీనామాను ఆమోదించేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 

మిగిలింది మరో 15 రోజులే....
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పరకాల పదవీకాలం జూలై 4నాటికి పూర్తి కానుంది. ఇంతలోనే ఆయన హఠాత్తుగా రాజీనామా నిర్ణయానికి రావటం వెనుక టీడీపీ–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని భావిస్తున్నారు. 

ఇక్కడ విమర్శలు.. అక్కడ వినయం
కేంద్రంపై భీకరంగా పోరాడుతున్నట్లు రాష్ట్రంలో తొడగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్ర«ధాని మోదీ ఎదుట సాగిలపడడంతో వారి బంధం బట్టబయలైన విషయం తెలిసిందే. చంద్రబాబు దాగుడు మూతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మ పోరాటం పేరుతో రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టి హడావుడి చేస్తూ మోదీని, కేంద్రాన్ని అదే పనిగా తిట్టడమే పనిగా పెట్టుకుని కొద్దిరోజులుగా చంద్రబాబు కాలం గడుపుతున్నారు. ఇప్పుడు బాబు ఢిల్లీ పర్యటనతో ఇదంతా ఉత్తదేనని తేలిపోయింది. 

పోరాటం పేరుతో డ్రామాలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి మోదీ ఎదుట వంగిపోయి కరచాలనం చేయడంతోనే కేంద్రంపై చంద్రబాబు వైఖరి ఏమిటనేది చెప్పకనే చెప్పినట్లయింది. కేంద్రాన్ని నిలదీస్తానని చెప్పి పాత విషయాలనే ప్రస్తావించడం, వాకౌట్‌ చేస్తానని మౌనం దాల్చడాన్ని ప్రజలంతా గమనించారు. చంద్రబాబు పైకి కేంద్రాన్ని విమర్శిస్తున్నా అంతర్గతంగా బీజేపీతో సంబంధాలు నెరపుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పోరాటం పేరుతో డ్రామాలాడుతున్నారనే విషయం బహిర్గతమైంది. సోషల్‌ మీడియాలో కూడా బాబు గోడమీది పిల్లి వ్యవహారాన్ని నెటిజన్లు దుమ్ముదులిపేశారు. 

ఇది కాదా కుమ్మక్కు?
సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు తీవ్రంగా ఎండగట్టారు. బాబు ఇక్కడ పోరాటం చేస్తానని చెబుతూ ఢిల్లీలో మోదీ ఎదుట సాగిలపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ సలహాదారుగా ఉంటారని, మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను  టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించారని ఇదంతా బీజేపీ–టీడీపీ లాలూచీ కాదా? అని నిలదీశారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఇది నిజమేనని తేలిపోవటంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఈ అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు పరకాల ప్రభాకర్‌తో వ్యూహాత్మకంగా రాజీనామా చేయించినట్లు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top