ఇక పురసమరం!

Panchayat Elections In Andhra Pradesh - Sakshi

మండపేట: సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారక ముందే స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ తాజాగా మున్సిపల్‌ పోరుకు కూడా  రంగం సిద్ధం చేస్తోంది. జూలై రెండో తేదీతో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాల కోసం మే 23 వరకూ వేచి చూడాల్సి ఉంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటినుంచీ పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జూన్‌లో వీటికి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మే 10వ తేదీన పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలిచ్చింది. మరోపక్క నగర, పుర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం జూలై రెండో తేదీతో ముగుస్తుండటంతో పురపోరు తెరపైకి వచ్చింది. దీంతో నూతన పాలక వర్గాల ఎన్నికకు కూడా ఈసీ సన్నాహాలు చేపట్టింది. జిల్లాలోని కాకినాడ మినహా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాల్టీలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం, గొల్లప్రోలు నగర పంచాయతీలకు 2014 మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే చివరిలో ఫలితాలు వెలువడ్డాయి.

జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనంతరం జూలై 3న స్థానిక సంస్థల కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. జూలై 2వ తేదీతో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా నగరాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, మే ఒకటో తేదీన ప్రచురించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. గడువు తక్కువగా ఉండటంతో అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రకారం, వార్డుల వారీగా జాబితాలు సిద్ధం చేసే పనిలో మున్సిపల్‌ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇందుకోసం ఇంటి నంబర్, వార్డు నంబర్, పోలింగ్‌ కేంద్రం తదితర వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారో చూసి, ఆ మేరకు కొత్త జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top