కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Notification Released For Karnataka By Elections - Sakshi

15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో గత ప్రభుత్వంలో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితంలేకపోయింది. దీంతో  ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అయితే వీరి కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. స్పీకర్‌ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేస్తుందా? లేక సమర్థిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లోనే దీనిపై న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఉప ఎన్నికల ప్రకటనతో కన్నడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు జరిగే స్థానాల్లో గెలుపు అధికార బీజేపీకి సవాలుగా మారింది. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని యడియూరప్ప సర్కార్‌ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇరు పార్టీల మధ్య ఏర్పడిన వైరుధ్యాలు బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top