వర్గీకరణపై మా చిత్తశుద్ధిని శంకించొద్దు | Sakshi
Sakshi News home page

వర్గీకరణపై మా చిత్తశుద్ధిని శంకించొద్దు

Published Sat, Jan 6 2018 2:20 AM

nomula narsimhaiyya about sc classification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదని టీఆర్‌ఎస్‌ నేత నోముల నర్సింహయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్‌ నిజాయితీతో వ్యవహరించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై అఖిలపక్ష బృందానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని సీఎం పలుమార్లు కోరారని గుర్తు చేశారు.

అఖిలపక్ష బృందానికి ప్రధాని సమయం ఇవ్వడం లేదంటే ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదనే అనుమానం వస్తోందన్నారు. వర్గీకరణపై నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సింది కేంద్రమేనన్నారు. ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ ఏ ఆందోళన చేయాలనుకున్నా ఢిల్లీలోనే చేయాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని విమర్శించారు. 

Advertisement
Advertisement