హిమాచలంలో ఎన్నికల వేడి!

Nominations time is over for Himachal Pradesh assembly polls

హిమాచల్‌ప్రదేశ్‌ 13వ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు సోమవారంతో ముగిసింది. పాలక, ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు మొత్తం 68 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేవలం 4 లోక్‌సభ సీట్లు, 71 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ కొన్ని కొత్త పోకడలకు తెరలేపింది. సీఎం పదవికి పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌నే ప్రకటించింది. అంతేగాదు, ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ అనే సూత్రానికి వీడ్కోలు చెప్పి 83 ఏళ్ల వీరభద్రతోపాటు, ఆయన కొడుకు విక్రమాదిత్యసింగ్‌కు (తండ్రి సీటైన సిమ్లా-రూరల్‌) టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

రెండేళ్ల క్రితం 2015 సెప్టెంబర్‌ 26న ఓ పక్క ముఖ్యమంత్రి వీరభద్ర చిన్న కూతురు మీనాక్షి పెళ్లి ఏర్పాట్లలో ఉండగానే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లు ఆయన, ఆయన కుమారుడు విక్రమాదిత్య ఆస్తులపై దాడులు జరిపి, కేసులు నమోదుచేశాయి. ఈ పరిణామాలను బీజేపీ కక్షసాధింపు చర్యలుగానే భావించిన కాంగ్రెస్‌ అప్పటి నుంచి వీరభద్రను సమర్థిస్తూనే ఉంది. మరో బలమైన కాంగ్రెస్‌ నేత లేకపోవడం సింగ్‌కు కలిసొచ్చిన అంశం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును కొడుక్కి ఇచ్చి, వరుసగా ఎనిమిదిసార్లు గెలిచిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు విద్యాస్టోక్స్‌ నియోజకవర్గం ఠియోగ్‌ (సిమ్లాజిల్లా) నుంచి ఆయన ఈసారి పోటీచేస్తున్నారు. 90 ఏళ్ల స్టోక్స్‌ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

గెలిచే అవకాశాలున్నా బీజేపీలో సీఎం పదవికి పోటాపోటీ!
1990 నుంచీ 2012 వరకూ బీజేపీ, కాంగ్రెస్‌ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. ప్రతి ఐదేళ్లకూ ఇలా పాలకపక్షాన్ని ప్రజలు మార్చే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగితే బీజేపీ వచ్చే నవంబర్‌ 9న జరిగే ఎన్నికల్లో గెలుస్తుంది. ఒకప్పటి కాంగ్రెస్‌ మాదిరిగా బీజేపీ తన సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. గతంలో బీజేపీ తరఫున పదేళ్లు సీఎంగా ఉన్న ఠాకూర్‌ ప్రేంకుమార్‌ ధూమల్‌, కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్‌ నడ్డా పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్ఢా ఎంపీ, మాజీ సీఎం శాంతాకుమార్‌(83)కు వయసు, గ్రూపు రాజకీయాల వల్ల బీజేపీ విజయం సాధించినా సీఎం అయ్యే అవకాశాలు లేవు. 1992లో ముఖ్యమంత్రి పదవికి శాంతాకుమార్‌ రాజీనామా చేశాక రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు క్షత్రియులే(ఠాకుర్లు లేదా రాజపూత్‌లు) ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగుతున్నారు.

ఇంకా సూటిగా చెప్పాలంటే వీరభద్ర, ధూమల్‌లే పాతికేళ్లుగా ముఖ్యమంత్రి పీఠం సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఈసారి పాలకపక్షం కాంగ్రెస్‌ ఓడిపోయి, నడ్డా బీజేపీ తరఫున సీఎం అయితే, పాతికేళ్లుగా సాగుతున్న ఠాకూర్‌ల పాలనకు తెరపడుతుంది. నడ్డా గతంలో రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేసిన నడ్డా బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. రాష్ట్ర చరిత్రలో శాంతా కుమార్‌ ఒక్కరే బ్రాహ్మణ ముఖ్యమంత్రి. ఠాకూర్ల (38 శాతం) తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బ్రాహ్మణులు(18 శాతం) ఇప్పటి వరకూ ‘కింగ్‌మేకర్లు’గా పేరు సంపాదించారు.

నియోజకవర్గం మారిన ధూమల్‌
ప్రస్తుతం హమీర్‌పూర్‌ ఎమ్యెల్యే అయిన మాజీ సీఎం ధూమల్‌ ఈసారి సుజన్‌పూర్‌ నుంచి పోటీచేస్తుండగా, సుజన్‌పూర్‌ బీజేపీ శాసనసభ్యుడు నరేంద్ర ఠాకూర్‌ హమీర్‌పూర్‌ నుంచి రంగంలోకి దిగారు. అవినీతి కుంభకోణాలతో పేరుమోసిన కేంద్ర టెలికం మాజీ మంత్రి పండిత్‌ సుఖరాం శర్మ కొడుకు అనిల్‌శర్మ వీరభద్ర కేబినెట్‌ నుంచి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై తన సొంత స్థానం మండీ నుంచి పోటీచేస్తున్నారు. సోనియాగాంధీ. రాహుల్‌గాంధీ సహా  40 మంది కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ప్రకటించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకర్గాల్లో ఒక్కొక్క బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వ్యతిరేక ప్రభావం లేకుంటే కాషాయపక్షానికే విజయావకాశాలుంటాయని అంచనా.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top