ఎస్పీ-బీఎస్పీ కూటమిలో బీటలు

Nishad Party Walks Out From SP BSP Alliance - Sakshi

లక్నో(ఉత్తర్‌ ప్రదేశ్‌): ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన ‘గట్‌బంధన్‌’ నుంచి నిశాద్‌ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నంపై పోటీచేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమిలో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్‌(నిర్బల్‌ ఇండియన్‌ షోషిట్‌ హమారా ఆమ్‌ దళ్‌) పార్టీ అధ్యక్షులు సంజయ్‌ నిశాద్‌ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్‌గంజ్‌ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తుపై పోటీ చేయాలని సంజయ్‌ నిశాద్‌ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు తెలిపారు. నిశాద్‌ పార్టీ అధ్యక్షులు సంజయ్‌ నిశాద్‌, ఆయన కుమారుడు ప్రవీణ్‌ నిశాద్‌(ప్రస్తుతం గోరఖ్‌పూర్‌ ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి) శుక్రవారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కలిశారు. ఈ పరిణామాలతో నిశాద్‌ పార్టీ బీజేపీ కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

మూడు దశాబాద్దాలుగా గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ హవానే సాగింది. వరసగా ఏడుసార్లు బీజేపీ అధ్యర్థులే విజయం సాధించారు. ఐదుసార్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యానాథే గెలిచారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో 2018లో గోరఖ్‌పూర్‌ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా నిశాద్‌ పార్టీ అధ్యక్షులు సంజయ్‌ నిశాద్‌ కుమారుడు ప్రవీణ్‌ నిశాద్‌ బరిలోకి దిగారు. నిశాద్‌ పార్టీ సహకారంతో ఎస్పీ ఈ స్థానం గెలుచుకోగలిగింది. ఈ విజయంలో నిశాద్‌పార్టీ కీలకపాత్ర పోషించింది. ఈ విజయం తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీ పార్టీలు కూటమిగా ఏర్పడటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. 

కొత్తగా బీజేపీ, నిశాద్‌ పార్టీ మధ్య ఏర్పడిన మైత్రిపై ఎస్పీ గోరఖ్‌పూర్‌ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌ యాదవ్‌ స్పందించారు. బీజేపీ, నిశాద్‌పార్టీ కలిసి పోటీ చేసినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలో గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానం గెలిచామే కానీ నిశాద్‌ పార్టీ నాయకత్వంలో కాదని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top