అప్పట్లో ప్రచారం కోసమే వాడుకునేవాళ్లు

Never Expect Cabinet Post, Says Minister Jayamala - Sakshi

సాక్షి, బెంగళూరు: చిన్నవయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల పక్కన చేసే అవకాశం దక్కించుకున్నారు. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు. అయినా తొణకలేదు. చివరకు రాజకీయాల్లో ప్రవేశించిన ఆమెకు ఆత్మీయ స్వాగతం లభించింది. కాంగ్రెస్‌ పార్టీ తరపున నేరుగా శాసన మండలిలోకి ఆమె అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి దక్కించుకుని.. కన్నడ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా జయమాల(62) నిలిచారు. 

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి జయమాల మాటల్లో... ‘సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయ ఆలోచనలు ఏనాడూ నాకు కలగలేదు. ఆ సమయంలో సినిమా వాళ్లను కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వాడుకునేవాళ్లు. ఆ జాబితాలో నేనూ ఉన్నాను. రోజుల తరబడి పార్టీల కోసం తిరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్‌ అంటే నాకు మొదటి నుంచి ఎందుకనో చాలా ఇష్టం. బహుశా ఇందిరా గాంధీ, సోనియా గాంధీ లాంటి శక్తివంతమైన మహిళలు ఆ పార్టీలో ఉన్నందుకే కాబోలు. ఆ తర్వాత పార్టీలో చేరిన నేను క్రియాశీలకంగా వ్యవహరించటం మొదలుపెట్టాను. పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి.

...మంది పదవి దక్కుతుందని అస్సలు ఊహించలేదు. ఆ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నా. నా భర్త, కూతురికి కూడా ఈ విషయం చెప్పేంత సమయం కూడా లేకుండా పోయింది. ప్రమాణం చేశాక నా కుటుంబ సభ్యులంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి, కర్ణాటక కాంగ్రెస్‌ కేడర్‌కు నా ధన్యవాదాలు. సీఎం కుమారస్వామిగారు నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తా’ అని ఆమె ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

స్టార్‌ హీరోయిన్‌గా... కాగా, 1980లలో తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో నటించిన జయమాల స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు. రాజ్‌కుమార్‌, అనంత నాగ్‌, విష్ణువర్ధన్‌, అంబరీష్‌, శంకర్‌ నాగ్‌, ప్రభాకర్‌ లాంటి స్టార్‌ హీరోల సరసన ఆమె నటించారు. తెలుగులో చిరంజీవితో కలిసి రాక్షసుడు చిత్రంలో కనిపించారు. అందులో తారకేశ్వరి పాత్రలో నటించింది ఆమెనే. తర్వాత నిర్మాతగా కూడా ఆమె పలు చిత్రాలను నిర్మించారు.

వివాదాలు... కాగా, కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్‌పర్సన్‌గా పని చేసిన సమయంలో ఆమె వైఖరిపై పలు విమర్శలు వినిపించాయి. అంతేకాదు తాను యుక్తవయసు(20 ఏళ్ల ప్రాయంలో)లో ఉన్నప్పుడు శబరిమళ ఆలయాన్ని సందర్శించి.. అయ్యప్ప విగ్రహాన్ని తాకానని ఆమె చేసిన ప్రకటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం కేసు.. కోర్టు దాకా వెళ్లింది కూడా.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top