
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు.
కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు.