దేవెగౌడకు ఫోన్‌ చేసిన ప్రధాని మోదీ

Narendra Modi Wishes HD Deve Gowda On 85th Birthday Today - Sakshi

న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీకి, జేడీఎస్‌, కాంగ్రెస్‌ కూటమికి పోరు వాడివేడిగా ఉంది. కర్ణాటక రాజకీయ పరిస్థితులు ఓ వైపు నుంచి కాక పుట్టిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ కాస్త కూల్‌గా వ్యవహరించారు. రాజకీయాలన్నింటిన్నీ పక్కన పెట్టి జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవె గౌడకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. దేవె గౌడకు ఫోన్‌ చేసిన మోదీ, ఆయన 85వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.‘మన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవె గౌడ జీతో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. దేవె గౌడ ఆరోగ్యవంతుడిగా సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటున్నా’  అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 1996 జూన్‌ 1 నుంచి 1997 ఏప్రిల్‌ 21 వరకు దేవె గౌడ మన దేశ ప్రధానిగా పనిచేశారు. నేడు ఆయన 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. 

మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యడ్యూరప్పచే ప్రమాణ స్వీకారం చేయించడంపై ఆ రాష్ట్ర గవర్నర్‌పై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ వారి ప్రయత్నాలకు చెక్‌పెట్టిన బీజేపీ, అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. బీజేపీ వైపే మొగ్గుచూపిన కర్ణాటక గవర్నర్‌ సైతం బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప చేతనే రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయించారు. రేపటి వరకు ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ ఉత్కంఠబరిత రాజకీయ పరిస్థితులతో బీజేపీపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు గుర్రుగా ఉన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top