
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’లో ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ వైదొలిగారు. మరే పార్టీలో చేరనని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటునానని తెలిపారు. నాంజిల్‌తోపాటు మరికొందరు దినకరన్ అనుచర నేతలు సైతం అదేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే ద్రవిడ సిద్ధాంతాలు, అన్నాదురైకి చోటు లేకుండా కేవలం జయలలిత బొమ్మతో నెగ్గుకురావడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.
అమ్మను అవమానిస్తున్నారు: దినకరన్
తన పార్టీ పతాకంలో జయలలిత బొమ్మవేయడాన్ని తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలగడం ద్వారా నాంజిల్ సంపత్ అమ్మను అవమానించాడని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన ఎంతో సీనియర్ డీఎంకే, ఎండీఎంకేల నుంచి అన్నాడీఎంకేలో చేరినవారన్నారు. ఇపుడే తానేదో పచ్చి అబద్ధాలు చెబుతున్నానని చెప్పడాన్ని అంగీకరించనని అన్నారు. పార్టీ ఏర్పాటు, పేరు నిర్ణయాన్ని అందరితోనూ చర్చించలేనని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కొరుకుంటున్నారో అదిమాత్రమే తాను చేయగలనని అన్నారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దికరన్ ప్రకటించారు.