కాంగ్రెస్‌ అడ్డా.. ఎగిరేది ఏ జెండా

Muslim vote count determines the fate of the candidates - Sakshi

కిషన్‌గంజ్‌

కిషన్‌గంజ్‌లో ముక్కోణపు పోటీ

ముస్లింలే గెలుపోటముల నిర్ణేతలు

బిహార్‌లో ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏకైక నియోజకవర్గం కిషన్‌గంజ్‌. ఇక్కడి ఓటర్లలో 60–70 శాతం ముస్లింలే. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా వారే కావడంతో ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీయూ తమ అభ్యర్థులుగా ముస్లింలను నిలబెట్టాయి. మరోవైపు అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం కూడా ఈసారి బరిలో అభ్యర్థిని దింపింది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అది కూడా ముస్లింల మధ్యే జరుగుతోంది. కిషన్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి మొత్తం 14 మంది పోటీ పడుతోంటే వారిలో ఎనమండుగురు ముస్లింలే కావడం గమనార్హం.

బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ప్రత్యేకమైన ఈ కిషన్‌గంజ్‌ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు(బహదూర్‌గంజ్, ఠాకూర్‌ గంజ్, కిషన్‌గంజ్, కొచదమన్, అమౌర్, బైసీ) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున డాక్టర్‌ జావేద్, జేడీయూ అభ్యర్థిగా మహ్మద్‌ అష్రఫ్, ఎంఐఎం నుంచి అక్తరుల్‌ హక్‌ ఇమామ్‌ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇంత వరకు ఒకే ఒక్కసారి ముస్లిమేతర అభ్యర్థి లఖన్‌లాల్‌ కపూర్‌ (1967) గెలిచారు. ఏప్రిల్‌ 18న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

‘హస్తం’ పట్టు నిలిచేనా?
కిషన్‌గంజ్‌ కాంగ్రెస్‌ అడ్డాగా పేరొందింది. 1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏడుసార్లు విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ అస్రరుల్‌ హక్‌ బీజేపీ అభ్యర్థి దిలీప్‌ కుమార్‌ జైస్వాల్‌పై లక్షా 94 వేల ఓట్ల రికార్డు ఆధిక్యతతో గెలిచారు. 2009లో కూడా అస్రరుల్‌ హక్‌ 90 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. హక్‌ గతేడాది డిసెంబర్‌లో గుండెపోటుతో కన్నుమూయడంతో కాంగ్రెస్‌ ఈసారి కిషన్‌గంజ్‌ ఎమ్మెల్యే జావేద్‌కు టికెట్‌ ఇచ్చింది. ఈ నియోజకవర్గం సంప్రదాయకంగా తమదే కాబట్టి ఈసారి కూడా తానే గెలుస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి జావేద్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల విజయాలతో ఉత్తేజం పొందిన పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సత్తా చాటేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి.

ఎన్నికల బరిలో ఎంఐఎం
ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగుతోంది. ఎంఐఎం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అక్తరుల్‌ ఇమామ్‌ ఇక్కడ  పోటీకి దిగడంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. సీమాంచల్‌ ఒవైసీగా పేరు పొందిన అక్తరుల్‌ ఇమామ్‌కు నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని,
తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ముస్లిం పెద్దలుగా పరిగణించే అస్రరుల్‌ హక్, మహ్మద్‌ తస్లిముద్దీన్‌ మరణించడంతో ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఎంఐఎం బరిలో దిగింది. ఇమామ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తస్లిముద్దీన్‌ ఆయనను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం పోటీ వల్ల ముస్లింల ఓట్లు చీలిపోతాయని అది ఎన్‌డీఏ (జేడీయూ)కి లాభించే అవకాశం ఉందని స్థానిక ముస్లిం నేతలు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధిపైనే జేడీయూ ఆశలు
రాష్ట్రీయ జనతాదళ్‌ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. ఆర్‌జేడీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మహ్మద్‌ తస్లిముద్దీన్‌ గతంలో మూడుసార్లు(1996, 98, 2004) ఇక్కడి నుంచి గెలిచారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్‌ ప్రాంతంలో (కిషన్‌గంజ్‌ నియోజకవర్గం ఈ ప్రాంతంలోనే ఉంది) ఉన్న 30 శాసనసభ సీట్లలో 13 అసెంబ్లీ స్థానాలు జేడీయూ గెలుచుకుంటే ఐదు బీజేపీకి దక్కాయి. ఆ ఎన్నికల్లో ఆర్‌జేడీ కాంగ్రెస్‌తో జతకట్టింది. ఇప్పుడది ఎన్‌డీఏలో ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే నియోజకవర్గంలో మొత్తం మీద ఎన్‌డీఏకే పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తమ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయాన్నందిస్తాయని జేడీయూ అభ్యర్థి అంటున్నారు.

కానరాని సందడి
కిషన్‌గంజ్‌ నియోజకవర్గం ఉన్న సీమాంచల్‌ ప్రాంతం భూటాన్, నేపాల్, పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దులో ఉంది. దేశంలో అతి పేద జిల్లాగా గుర్తింపు పొందిన కిషన్‌గంజ్‌లో నిరుద్యోగం కీలక సమస్య. పట్టా పుచ్చుకున్న చాలామంది ఉద్యోగాల్లేక పొలం పనులు చేసుకుంటున్నారు. ‘మమ్మల్ని బాగుచేసే వారెవరూ లేరు. ఎవరొచ్చినా మా దరిద్రం తీరదు. మాకు ఉద్యోగాలు రావు. ఇక రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు’ అనేది ఇక్కడి సామాన్య జనాభిప్రాయం. అందుకే పోలింగ్‌ దగ్గర పడుతున్నా నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top