ఎన్నికలకు ముందే మిషన్‌ భగీరథ | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ముందే మిషన్‌ భగీరథ

Published Mon, Apr 23 2018 2:58 AM

Mission Bhagiratha Before the elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమన్న సవాల్‌కు కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మిషన్‌ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకన్నా నాలుగైదు నెలల ముందే మిషన్‌ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. మెయిన్‌ గ్రిడ్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మిషన్‌ భగీరథ పనులపై ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమీక్షించారు. ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలున్న జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, నల్లా మల్లారెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్‌.డబ్లు్య.ఎస్‌ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

దసరా నాటికి పూర్తి పనులు... 
‘‘మిషన్‌ భగీరథలో ప్రధానమైన ఇన్‌టేక్‌ వెల్స్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పైపులైన్లు, పంపుసెట్లతో కూడిన మెయిన్‌ గ్రిడ్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో అంతర్గత పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా 75 శాతం ప్రాజెక్టు పని పూర్తయింది. ఇప్పటికే చాలా గ్రామాలకు నీరు అందుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా నీరందిస్తున్నారు. వచ్చే నెల చివరికి ప్రతి గ్రామానికీ నీరందాలి. ఈ సందర్భంలో తలెత్తే సమస్యలను జూన్‌ 10 నాటికి పరిష్కరించాలి. దసరా నాటికి అంతర్గత పనులు పూర్తి చేయాలనే గడువు విధించుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. డిసెంబర్‌ నెలాఖరుకల్లా వందకు వంద శాతం ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు చేరాలి. దీంతో ప్రభుత్వం చేసిన సవాల్‌ను సాధించి చూపడంతోపాటు పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన వారమవుతాం. అంతకు మించి ప్రజల ఆరోగ్యాలు కాపాడిన వారమవుతాం’’అని ముఖ్యమంత్రి అన్నారు. 

మారుమూల జిల్లాలకు ప్రత్యేక వ్యూహం... 
‘‘నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉంది. ఆ ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలి. అక్కడ పనులు చేయడానికి కూలీలు దొరకరు. మెటీరియల్‌ సరఫరా చేయడం కష్టం. అక్కడ పనులు చేసే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే అవకాశాన్ని పరిశీలించాలి. చెంచుగూడేలు ఎక్కువగా ఉండే అచ్చంపేట లాంటి నియోజకవర్గాలతోపాటు 10–15 నివాస ప్రాంతాలుండే అటవీ ఆవాస ప్రాంతాలకూ మంచినీరు అందించాలి. స్థానిక వనరులను గుర్తించి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి వారికి సురక్షిత మంచినీరు అందించే బాధ్యతను స్వీకరించాలి’’అని కేసీఆర్‌ సూచించారు. 

దేశానికి మనమే మార్గదర్శనం... 
‘‘మిషన్‌ భగీరథపై ఇప్పుడు యావత్‌ దేశం ఆసక్తి కనబరుస్తున్నది. జాతీయ పార్టీలూ దేశానికంతా తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టాలని ఆలోచిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు మన పథకాన్ని అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. వారందరికీ మనమే ఆదర్శం. రేపు దేశమంతటికీ మంచినీటిని సరఫరా చేసే పథకానికి మనమే మార్గదర్శకం వహించబోతున్నాం’’అని సీఎం అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు ఏ ఆటంకం లేకుండా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని కేసీఆర్‌ అన్నారు.  

Advertisement
Advertisement