నాలుగేళ్లపాటు చక్రం తిప్పిన సత్యవేణి

Minister Hand On ZC Satyaveni Transfer - Sakshi

టీడీపీ అనుచరురాలిగా వ్యవహరించిన జోనల్‌ కమిషనర్‌.?

గంటాతో మాత్రంనిత్యం విభేదాలే

బదిలీ వెనుక మంత్రి హస్తం

విశాఖ సిటీ: ఆమె మహా విశాఖ నగర పాలక సంస్థలో బాధ్యత గల ఉన్నతాధికారి. కానీ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపించేవి. ముఖ్యంగా తూర్పు ఎమ్మెల్యేకు అనుచరురాలిగా ఉండే వారనే విమర్శలు వెల్లువెత్తేవి. ఆయన చెప్పిన పని చెయ్యడం మాత్రమే తన ప్రథమ కర్తవ్యంగా భావించిన ఆ జోనల్‌ కమిషనర్‌... మంత్రి గంటా విషయంలో మాత్రం మొండిగా ఉండేవారు. ఎమ్మెల్యే ఆదేశాలే తప్ప ఎవ్వరినీ పట్టించుకోకపోవడంతో మంత్రితో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే ఆమె బదిలీకి రంగం సిద్ధం చేసేంతలా. విషయం తెలుసుకున్న ఆ అధికారిణి.. ఎమ్మెల్యేతో పావులు కదిపి ఆ బదిలీ తనను బూరెల బుట్టలో పడేసేలా సొంతూరుకి పయనమయ్యేలా మార్చేసుకున్నారు.

మంత్రి చక్రాన్ని అనుకూల దిశలో...
తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు, ఇతర అంశాల విషయంలో జెడ్సీ సత్యవేణి అనుసరిస్తున్న వైఖరి మింగుడుపడని గంటా ఆమె బదిలీకి పట్టుబట్టారు. ఈ బదిలీ విషయం కొద్ది రోజులుగా నలుగుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న జెడ్సీ సత్యవేణి... మంత్రి సంధించిన బదిలీ బాణాన్ని తనదైన శైలిలో అనుకూల దిశకు మలచుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రితో తన బదిలీ విషయంపై నాలుగు రోజుల పాటు ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి గంటాతో సదరు ఎమ్మెల్యే, మంత్రి ఫోన్‌లో సంప్రదించినా బదిలీ చెయ్యాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చెయ్యాల్సి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకున్న సత్యవేణి సొంతూరైన కాకినాడకు అదనపు కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. దీంతో ఆమెను ఇక్కడి నుంచి పంపించాలన్న మంత్రి కల నెరవేరగా, బూరెల బుట్టలో పడ్డట్లుగా సొంతూరుకు ఆమె వెళ్లిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరన్న విషయం జోనల్‌ కమిషనర్‌ సత్యవేణి విషయంలో మరోసారి నిరూపితమైంది. 

విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం
జీవీఎంసీ జోన్‌ – 1 కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన పీఎం సత్యవేణిని కాకినాడ అదనపు కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందనేది బహిరంగ రహస్యంగా జోన్‌ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్యవేణి... 2014లో వెలగపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన చేసే ప్రతి పనికీ ఈమె అండదండలు పుష్కలంగా ఉండేవని తెలుస్తోంది. జోనల్‌ కమిషనర్‌ నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి.. ఎమ్మెల్యే చేసే ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఫలితంగా జోన్‌ – 1 అభివృద్ధి కుంటుపడింది.

గ్రీవెన్స్‌ ద్వారా వచ్చే వినతులను సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో అన్నింటిదీ ఒకబాటైతే... ఈమె జెడ్సీగా పనిచేస్తున్న జోన్‌ – 1 దారి మాత్రం వేరు. అక్కడ అభివృద్ధి శూన్యం. ఆక్రమణలు బహిరంగం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా అన్ని జోన్లలో స్వచ్ఛత విషయంలో జోనల్‌ కమిషనర్లు కఠినంగా వ్యవహరిస్తే... ఈమె మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంలో ఫీల్డ్‌ విజిట్‌కి వెళ్లిన ప్రతిసారీ ప్రధాన కమిషనర్‌ హరినారాయణన్‌ బహిరంగంగా చీవాట్లు పెట్టినా ఆమె మాత్రం తన పంథా మార్చుకోలేదు. పైగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిసారీ... కమిషనర్‌కు పై నుంచి ఆదేశాలు వచ్చేవని జీవీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిధులు మురగబెట్టినా కనీస నిర్ణయాలు తీసుకోకపోయినా ఈ జెడ్సీ దర్జాగా సాగిపోయారు.

మంత్రి చెబితే వినాలా..?
ఎమ్మెల్యే వెలగపూడి పేరుతో ఆయన అనుచరులు చేసే ప్రతి ఆక్రమణకు జెడ్సీ సత్యవేణి వత్తాసు పలికేవారన్నది బహిరంగ రహస్యం. పార్కులు, ఖాళీ స్థలాలు దర్జాగా ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోకుండా వ్యవహరించేవారు. చెరువులను అభివృద్ధి చేసి నీటి వనరులు పరిరక్షించుకోవాలని జీవీఎంసీ భావిస్తే... ఈమె మాత్రం ఆ చెరువులు ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదు. వేసవిలో నీటి సరఫరా విషయంలోనూ సత్యవేణి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరిలోవ పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటికి అవస్థలు పడ్డారు.

ఈ విషయంలో 20 రోజుల క్రితం జీవీఎంసీ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేసినా ఆమె పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యే అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సత్యవేణి.. మంత్రి గంటా విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా నడుచుకునేవారు. వెలగపూడి చెప్పే పనిని క్షణాల్లో పూర్తి చేసే ఆమె.. మంత్రి గంటా ఏ పనిచెప్పినా పట్టించుకునేవారే కాదు. ఫలితంగా పలు మార్లు గంటాకు, ఈమెకు మధ్య వాగ్వాదం జరిగింది. తరచూ మంత్రి గంటా చీవాట్లు పెట్టేవారు. ఇటీవల మంత్రి ప్రధాన అనుచరులు ఓ విషయంలో వాగ్వాదం జరిగిన సమయంలో నిన్ను బదిలీ చేయిస్తామని జెడ్సీని  బహిరంగంగానే హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top