యూపీలో ఒక్కటైన నాలుగు పార్టీలు..

Major Opposition Parties Reach Mega Deal in UP To Take On Bjp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అత్యధిక లోక్‌సభ స్ధానాలున్న యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు సమిష్టిగా పోరాడాలని నిర్ణయించాయి. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. యూపీలోని 80 పార్లమెంట్‌ స్ధానాల్లో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో పోటీ చేయాలనే కసరత్తు తర్వాత చేపట్టాలని ఈ పార్టీలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలంటే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో విపక్షాల మధ్య అవగాహన కీలకం. ఈ ఏడాది యూపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో సమైక్యంగా పోటీచేసిన ప్రతిపక్షాలు మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే. గోరఖ్‌పూర్‌, పూల్పూర్‌, కైరానా, నూర్పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీపై కలిసికట్టుగా పోరాడిన విపక్షాలు దీటైన విజయాలు నమోదు చేశాయి.

ఇదే ఊపుతో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీట్ల సర్ధుబాటుకు పూనుకోవాలని ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీఎస్పీల మధ్య సీట్ల సర్ధుబాటు బెడిసికొట్టడం విపక్ష శిబిరంలో నిరుత్సాహం అలుముకుంది. బీఎస్పీ అధినేత్రి తమకు 50 స్ధానాలు కేటాయించాలని కోరతుండగా, కాంగ్రెస్‌ 22 సీట్లను ఇవ్వచూపింది. 30 స్ధానాలకు మించి బీఎస్పీకి ఇవ్వలేమని కాంగ్రెస్‌ స్పష్టం చేయడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top