ఎన్నికలకు పోలీస్‌ శాఖ రెడీ

Mahender Reddy Says Police Department Is Ready For Election Duty - Sakshi

రాష్ట్రంలో అందుబాటులో 60 వేల పోలీసులు

మొత్తం లక్షమంది సిబ్బందిని ఎన్నికల్లో మోహరించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో పోలీస్‌శాఖ ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది. బందోబస్తు, అందుకు తగిన కార్యాచరణ, బలగాల పరిస్థితి, సిబ్బంది తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సందర్భంలో తీసుకున్న చర్యలు, చేపట్టిన బందో బస్తు వివరాలు, మానిటరింగ్, తదితరాలపై  నివేదిక రూపొందించబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి తో డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సీఎస్‌కు వివరించినట్టు తెలిసింది.

 బెటాలియన్లు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లకు... 
రాష్ట్రంలో 13 స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్లున్నాయి. ప్రతి బెటాలియన్‌లో వెయ్యిమంది సాయుధ సిబ్బంది ఉండాలి. కానీ, ఖాళీల కారణంగా ప్రతి బెటాలియన్‌లో 600 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఎన్నికల బందోబస్తుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని మౌఖికంగా బెటాలియన్‌ విభాగానికి పోలీస్‌శాఖ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం బెటాలియన్ల నుంచి 7 వేల నుంచి 8 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. ప్రతి జిల్లాలో ఆర్మ్‌డ్‌ హెడ్‌క్వార్టర్లలో 80 నుంచి 100 మంది, కమిషనరేట్లలో 250 నుంచి 300 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. సుమారు 3,500 మంది, బెటాలియన్లు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ కలిపి 12 వేల మంది, రాష్ట్రంలోని సివిల్‌ పోలీసులు సుమారు 40 వేల మంది సిబ్బంది ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు. మొత్తం 60 వేల మంది సిబ్బందితో పోలీస్‌ శాఖ సమాయత్తమవుతోంది.  

రంగంలోకి పారామిలటరీ... 
ఎన్నికలకు పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇప్పుడు 150 కంపెనీల బలగాలను ఎన్నికలవేళ బందోబస్తు కోసం కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ ద్వారా పోలీస్‌ శాఖ కోరనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో కంపెనీలో 125 నుంచి 128 మంది సిబ్బంది ఉంటారు. 

హోంగార్డులు సైతం... 
రాష్ట్ర పోలీస్‌ సిబ్బంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతోపాటు రాష్ట్రంలో ఉన్న 24 వేల మంది హోంగా ర్డులను ఎన్నికల విధుల్లో నియమించేలా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా 90 వేల నుంచి లక్ష మంది పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల బందోబస్తులో నియ మించే అవకాశమున్నట్టు తెలిసింది.  

త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష 
ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల కోసం బలగాల మోహరింపు తదితరాలపై త్వరలోనే ఎన్నికల కమిషన్‌తో పోలీస్‌ శాఖ భేటీ కాబో తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది సిబ్బందిని మోహరించాలి, సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలెన్ని? వాటిని ఎలా నియంత్రించాలన్న అంశాలపై చర్చించే అవకాశముంది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top