ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటి? | Madhala Ravi Comments On BJP Party Prakasam | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటి?

Jun 13 2018 11:11 AM | Updated on Jun 14 2018 1:10 PM

Madhala Ravi Comments On BJP Party Prakasam - Sakshi

మాట్లాడుతున్న చలసాని శ్రీనివాస్‌

ఒంగోలు: భారతీయ జనతా పార్టీని ఉత్తర భారతదేశపు పార్టీ అంటే తప్పేంటో చెప్పాలని ప్రత్యేక హోదా–విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ బీజేపీ నేతలను డిమాండ్‌ చేశారు. స్థానిక ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మహారాష్ట్రకు రైల్వే బడ్జెట్‌లో రూ. 50 వేల కోట్లు కేటాయించారని, కానీ తెలుగు రాష్ట్రాలకు కేవలం రూ. 5,600 కోట్లు ముష్టిగా వేశారని అలాంటప్పుడు బీజేపీని ఉత్తర భారతీయ జనతా పార్టీ అనడం సమంజసమేనంటూ తన వాదనను సమర్థించుకున్నారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీజేపీ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటిస్తున్నారని, ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

తనతో పాటు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా బీజేపీ చెప్పే అభివృద్ధి ఏంటో స్పష్టం చేస్తామని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్‌ తీసుకున్న రాజకీయ పార్టీలతో పాటు అనేక పార్టీలు తామే ఉద్యమాలు మొదలు పెట్టామంటూ చెప్పుకోవడం సరికాదని, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తామే హోదా ఉద్యమాన్ని ప్రారంభించామనేది జనానికి తెలుసన్నారు. రాజకీయ పార్టీ జెండాలకు అతీతంగా సినీ హీరోలు కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం మునుకోటి, భాను ప్రాణత్యాగం చేశారని, వారి ఆత్మలు శాంతించాలంటే హోదా సాధని తప్పనిసరన్నారు. జూలైలో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్నాయని, యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా నెలలో కనీసం ఒక్కరోజు వారికి నచ్చిన సమయంలో ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఎక్కడైతే జాతీయ రహదారి కలుస్తుందో ఆ ప్రాంతంలో 24 గంటల బంద్‌ చేపడతామని తెలిపారు. దీంతో బంద్‌ ప్రభావం మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని పేర్కొన్నారు.

హోదాకు మా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ మద్దతు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, మా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నుంచి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నామని సినీ నిర్మాత, నటుడు మాదాల రవి ప్రకటించారు. ప్రగతిశీల శక్తులు అందరూ కలిసి వచ్చి మొండి వైఖరి అవలంబిస్తున్న బీజేపీ మెడలు వంచేందుకు భగత్‌సింగ్‌లా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చుకునేందుకు తగిన నిధులు కేటాయించే వరకు పోరుబాట పడదామన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. సినీ సంగీత దర్శకులు ఖుద్దూస్‌ మాట్లాడుతూ కళా చైతన్యం లేకుండా ఏ ఉద్యమం కూడా విజయం సాధించలేదని, అందుకే ప్రత్యేక హోదా సాధనక కోసం తాను పాటలకు సంగీతం అందించానని, ఇటీవల తాను సంగీతం అందించిన ఓ పాటను పాడి వినిపించారు. కవులు, కళాకారులు గజ్జెకట్టి ప్రజలను ఉద్యమం వైపు నడిపించేందుకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ, ప్రొఫెసర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement