
సాక్షి, చెన్నై: కేంద్రంపై అవిశ్వాసం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అన్నాడీఎంకే ఎంపీ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై విమర్శించారు. ఆ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. శుక్రవారం ఆయన తమిళ మీడియాతో మాట్లాడారు. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా పార్లమెంట్ స్తంభించే రీతిలో తాము కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు.
ప్రత్యేక హోదాపై అక్కడి తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తమకు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. తమిళ కూలీలను తుపాకులతో కాల్చి, నీళ్లల్లో ముంచి చంపుతున్న ఏపీ ప్రభుత్వానికి ఎలా మద్దతు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాకు హోదా నినాదంతో ముందుగా వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం తీసుకొస్తే, ఆ తదుపరి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందన్నారు. బాబు రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తున్నారన్నారు.