రేవణ్ణతో అగచాట్లు..!!

Kumaraswamy In Fix Over Portfolios For Revanna - Sakshi

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొత్త చిక్కుల్లో పడ్డారు. కేబినెట్‌ కేటాయింపుల్లో మిత్రపక్షం కాంగ్రెస్‌తో కన్నా సొంత అన్నయ్య రేవణ్ణ నుంచి ఆయనకు తలనొప్పి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌(పీడబ్ల్యూడీ), విద్యుత్‌ శాఖలను తనకే కేటాయించాలని రేవణ్ణ పట్టుబట్టినట్లు సమాచారం.

రేవణ్ణ అంటే మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రాణం. అందుకే ఆయన కోరిక మేరకు రాహుల్‌తో దేవెగౌడ చర్చలు జరిపి ఒప్పించారు కూడా. 2004-2006ల మధ్య కాంగ్రెస్‌-జేడీఎస్‌ల కూటమి ప్రభుత్వంలో, 2006-2007ల మధ్య జేడీఎస్‌-బీజేపీ ప్రభుత్వంలో రేవణ్ణ ఈ పోర్ట్‌ఫోలియోలను చేపట్టారు.

కాగా, రేవణ్ణకు రెండు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవణ్ణపై తాను ఎలాంటి కామెంట్‌ చేయబోనని అన్నారు. పార్టీ తనకు ‘వాచ్‌మన్‌’ ఉద్యోగం ఇచ్చిందని తాను దాన్ని సక్రమంగా నిర్వహిస్తానని మీడియాతో బహిరంగంగా శివకుమార్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో సిద్ధారామయ్య కేబినెట్‌లో శివకుమార్‌ విద్యుత్‌ శాఖ మంత్రిగా పని చేశారు.

కాగా, రెండు పోర్ట్‌ఫోలియోలతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్‌ జిల్లా నుంచి మరే ఎమ్మెల్యేను మంత్రిగా చేయొద్దని రేవణ్ణ కుమారస్వామి, దేవెగౌడలను కోరినట్లు రిపోర్టులు వస్తున్నాయి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణకు కుమారస్వామి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో అతను కోపంతో ఊగిపోతున్నట్లు స్థానిక జేడీఎస్‌ నేతలు చెబుతున్నారు. ఈ మధ్య రేవణ్ణ ఇంటికి వెళ్లిన కుమారస్వామిని ప్రజ్వల్‌, రేవణ్ణ భార్య పలకరించలేదని కూడా సమాచారం.

కాగా, ఎన్నికల వల్ల దేవెగౌడ కుటుంబంలో మనస్పర్దలు వచ్చినట్లు గౌడ సన్నిహితుడు ఒకరు తెలిపారు. కుటుంబం మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చేందుకు దేవెగౌడ తీవ్రంగా యత్నిస్తున్నట్లు వెల్లడించారు. కావాలనే ప్రజ్వల్‌ను కుమారస్వామి రాజకీయాలకు దూరంగా పెడుతున్నట్లు రేవణ్ణ భావిస్తున్నారని చెప్పారు. తన తనయుడు నిఖిల్‌ కుమార్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకే కుమారస్వామి ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కుటుంబంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు దేవెగౌడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్‌ను తన స్థానంలో నిలబెడతానని చెప్పినట్లు తెలిసింది. కాగా, బుధవారం కాంగ్రెస్‌-జేడీఎస్‌ల కూటమి కర్ణాటకలో కేబినేట్‌ను విస్తరించనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top