17న కమల్‌నాథ్‌ ప్రమాణం

Kamal Nath to be sworn-in as Madhya Pradesh CM on December 17 - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ను కలిశారు. ఆయన వెంట సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్, సురేశ్‌ పచౌరీ, వివేక్‌ తన్‌ఖా, అరుణ్‌ యాదవ్‌ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్‌..‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్‌నాథ్‌కు ఆమె ఓ లేఖ అందజేశారు.

అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్‌లోని లాల్‌పరేడ్‌ గ్రౌండ్‌లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్‌లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్‌నాథ్‌ మధ్యప్రదేశ్‌ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు గెలుచుకోగా ఎస్‌పీ(1), బీఎస్‌పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది.

అపార అనుభవం, ఆర్థిక బలం
కమల్‌నాథ్‌ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి..
► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత.
► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు.
► 9 సార్లు లోక్‌సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు.
► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు.
► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్‌ నాథ్‌పై ఉన్నది అభిమానమని అంటుంటారు.
     పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు.
► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్‌ స్కూల్లోనే సంజయ్‌ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్‌లకు విశ్వసనీయ సలహాదారు.
► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్‌ మార్క్‌ అయిన 116 సాధించింది కాంగ్రెస్‌. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్‌నాథ్‌ వల్లనే సాధ్యమన్న నమ్మకం.
► లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం,  వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్‌ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం.
► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top