అంతర్మథనంలో ఎస్వీ మోహన్‌ రెడ్డి!

 Internal Clashes: SV mohan reddy demands Nara lokesh to contest from Kurnool  - Sakshi

లోకేష్ పోటీ చేస్తే నేను తప్పుకుంటా: ఎస్వీ

సాక్షి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుపై ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆయన కర్నూలు సీటు తనదే అని ధీమా వ్యక్తం చేసినా .... ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్‌ రెడ్డి... కర్నూలు నుంచి ఒకవేళ నారా లోకేష్‌ పోటీ చేస్తే తానే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే మరో నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనని, టికెట్‌ కూడా అడగనని అన్నారు. కర్నూలు నుంచి లోకేశ్‌ పోటీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన... మరొకరికి ఆ సీటు కేటాయిస్తే ఒప్పుకునేది లేదన్నారు. 

కాగా ఇప్పటికే కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్‌ దాదాపుగా ప్రకటించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. మరోవైపు టీడీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబానికి మద్దతు తెలిపిన ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్‌ ఇచ్చేందుకు కేఈ సోదరులు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద కేఈ సోదరులు ప్రతిపాదన తెచ్చారు.

దీంతో ఎస్వీ మోహన్‌ రెడ్డికి.. ఓవైపు టీజీ వెంకటేశ్‌ కుమారుడు, మరోవైపు కోట్ల కుటుంబం నుంచి పోటీ ఎదురు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. టీజీ, కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకు ఆయన తాజాగా కర్నూలు నుంచి లోకేశ్‌ పోటీ చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా పోటీ చేస్తే లోకేష్...లేదా నేనే... అంతేకానీ వేరేవాళ్లు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఊరుకునేది లేదంటూ ఎస‍్వీ మోహన్ రెడ్డి మీడియా ముఖంగా ఫీలర్లు వదులుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న కర్నూలు అసెంబ్లీ టికెట్‌ చివరికి ఎవరికి దక్కుతుందో.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top