ఆవూ ఓడింది–దూడా ఓడింది!

Indira gandhi Lose Election After Emergency - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని పదవిలో ఉండగా లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయిన ఏకైక నేత ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ (1975–77) తర్వాత 1977 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్షమైన కాంగ్రెస్‌ పరాజయంతోపాటు ప్రధాని ఇందిరాగాంధీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓడిపోయారు. ఇందిరను జనతా పార్టీ తరఫున పోటీచేసిన సోషలిస్ట్‌ నేత రాజ్‌నారాయణ్‌ 55,202 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో పొరుగున ఉన్న కొత్త నియోజకవర్గం అమేధీ నుంచి కాంగ్రెస్‌ తరఫున మొదటిసారి నిలబడిన ఇందిర చిన్న కొడుకు సంజయ్‌గాంధీకి కూడా ఓటమి తప్పలేదు. సంజయ్‌పై జనతా అభ్యర్థిగా పోటీచేసిన రవీంద్రప్రతాప్‌ సింగ్‌ 75,844 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్‌ ఎన్నిక గుర్తు ఆవు, దూడ.

హిందీలో గాయ్‌ ఔర్‌ బఛడా అంటారు. తల్లీకొడుకులిద్దరూ ఒకేసారి ఒకే ప్రాంతంలో ఎన్నికల్లో ఓడిపోవడంతో ‘గాయ్‌ భీ హారీ, బఛడా భీ హారా’ (ఆవూ ఓడింది–దూడా ఓడిపోయింది) అనే నినాదం మార్మోగింది. ఆ తర్వాత ప్రధాని పదవిలో ఉండగా లోక్‌సభకు ఓడిపోయినవారెవరూ లేరు. మాజీ ప్రధాని హోదాలో ఉండగా పోటీచేసి లోక్‌సభ ఎన్నికల్లో ఓసారి ఓడిన ఘనత హెచ్‌డీ దేవెగౌడకే దక్కుతుంది. ఆయనను 2004 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సమీపంలోని కనకపురా స్థానంలో గౌడను కాంగ్రెస్‌ అభ్యర్థి తేజస్వినీ గౌడ ఓడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top