కర్ణాటక ఎఫెక్ట్‌: ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు!

Ibobi Singh And Mukul Sangma Will Meet respective Governors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొన్ని నెలల కిందట ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తొలుత అతిపెద్ద పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గోవా కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను డిమాండ్ చేయగా... ఆపై మణిపూర్ మాజీ సీఎం ఇబోబి సింగ్, మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మాలు కర్ణాటక గవర్నర్ వజూభాయ్‌ వాలా నిర్ణయంపై స్పందించారు. మాజీ సీఎంలు సైతం తమ రాష్ట్ర గవర్నర్‌లను కలుసుకుని ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మణిపూర్ గవర్నర్‌ను ఇబోబి సింగ్, మేఘాలయ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ల ఆధ్వర్యంలో రాజధానుల వద్ద, ఇతర నేతలు జిల్లా కలెక్టరెట్ల వద్ద ధర్నా చేసి తమ నిరసన తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నేతలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా గవర్నర్‌ వజుభాయ్‌ వాలా నామినేట్‌ చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ నేత యడ్యూరప్ప బల నిరూపణ పూర్తవకుండా గవర్నర్ ఇలా ఎమ్మెల్యేను నామినేటెడ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

గతేడాది మార్చిలో మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్ ‌(ఎన్‌పీఎఫ్‌)తో పాటు ఒక లోక్‌ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్‌ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 32కి పెరిగింది. బీజేపీ నేత నాంగ్‌తోంబం బీరేన్‌ సింగ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్‌ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్‌పీపీ అధికారంలోకి వచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top