‘ఉత్కళ’లో ఉత్కంఠ

IAS And IPS Officers Contest From Bhubaneswar - Sakshi

భువనేశ్వర్‌లో మాజీ ఐఏఎస్‌– ఐపీఎస్‌ మధ్య పోటీ

విజయానికి బీజేపీ – బీజేడీ ఎత్తులు పైఎత్తులు

ప్రతిష్టాత్మక భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానంలో ఈసారి ఆసక్తికరమైన పోటీ జరగబోతోంది. ఇద్దరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మధ్య రసవత్తర పోరుకు ఈ ఎన్నికలు తెరతీశాయి. ముంబై మాజీ పోలీసు కమిషనర్‌ అరూప్‌ పట్నాయక్‌ బిజూ జనతాదళ్‌ నుంచీ, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి అపరాజితా సారంగి పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ బీజేడీ, బీజేపీ మధ్యనే కొనసాగనుందని విశ్లేషకుల అంచనా. అపరాజిత ఈ నియోజకవర్గంలో మూడు నెలల నుంచి ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేడీ లక్షా తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలవడంతో, అపరాజితకు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేయక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టింది. మిత్రపక్షాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని సీపీఎం సీనియర్‌ నాయకుడు జనార్దన్‌ పాఠికి కేటాయించింది. అయితే పోరు మాత్రం అపరాజిత – అరూప్‌ పట్నాయక్‌ మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎవరీ అపరాజిత?
భువనేశ్వర్‌లో బీజేడీ అభ్యర్థి ఐపీఎస్‌ అధికారి అరూప్‌ పట్నాయక్‌తో ఢీకొనబోతోన్న బీజేపీ అభ్యర్థి అపరాజిత 1994 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పనిచేస్తుండగా బీజేపీలో చేరేందుకు గత నవంబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే బీజేపీలో చేరినప్పటి నుంచి భువనేశ్వర్‌లో బీజేపీ అంటేనే అపరాజిత అనే స్థాయికి చేరింది. భువనేశ్వర్‌లో వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో పనిచేసిన అపరాజిత జనంలో బాగా పేరున్న వ్యక్తి. రాజకీయవేత్తల కంటే కూడా భవనేశ్వర్‌లోని ప్రతి ప్రాంతం ఆమెకు సుపరిచితం. దీనితో పాటు అక్కడి ప్రజల సమస్యలపైన కూడా ఆమెకు పట్టుండడంతో ఆమె పాలనానుభవం ఆమెకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నింటికీ మించి మూడు నెలల క్రితం నుంచే సారంగి భువనేశ్వర్‌లోని మురికివాడల్లోకి వెళ్లి ప్రచారం చేశారు. భువనేశ్వర్‌లోని ప్రతి తలుపూ తడుతున్నారు.

అరూప్‌ పట్నాయక్‌ లోతెంత?
నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ప్రసన్న కుమార్‌ పాటసాని స్థానంలో బీజేడీ అరూప్‌ పట్నాయక్‌ను తీసుకొచ్చింది. ముంబై మాజీ పోలీసు కమిషనర్‌గానూ, ఒరిస్సాలో వివిధ స్థాయిల్లో పనిచేసిన 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అరూప్‌ పట్నాయక్, బీజేపీ అభ్యర్థి అపరాజితకు గట్టిపోటీ ఇస్తారని భావించడం వల్లనే బీజేడీ ఒక అనుభవజ్ఞుడైన లోక్‌సభ సభ్యుడిని పక్కన పెట్టిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదేవిధంగా పాలకపక్షంపై వ్యతిరేకత ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా అరూప్‌ పట్నాయక్‌ను బీజేడీ తెరపైకి తెచ్చింది. అరూప్‌ పట్నాయక్‌ రిటైర్‌ అయిన మూడేళ్ల అనంతరం గత ఏడాది బిజూ జనతాదళ్‌ లో చేరారు.ఇటు బీజేపీ, అటు బీజేడీ సభ్యులిద్దరూ భువనేశ్వర్‌కు సుపరిచితులే కావడం, ఇద్దరికీ పాలనానుభవం ఉండడం, ఇద్దరూ ప్రజలతో సంబంధం ఉన్న వృత్తుల్లో ఉండడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top