ఆకాశమంత అభిమానం..

Huge public to YS Jagan Prajasankalpayatra Last day  - Sakshi

ప్రజాసంకల్ప యాత్ర ఆఖరి ఘట్టానికి పోటెత్తిన జనం 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అడుగులో అడుగేసిన అశేష జన సందోహం.. 

‘జై జగన్‌’ నినాదాలతో హోరెత్తిన ఇచ్ఛాపురం

ఇక సమరానికి సిద్ధమంటూ సంకేతాలు

రాష్ట్రంలోని ప్రతి సమస్య మీదా ఇవాళ నేను పూర్తి అవగాహనతో ఉన్నానని మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అందుకే ప్రతి పేదవాడికీ మంచి చేయాలనే తపన, ఆలోచన నాలో ఉంది. అందుకే నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను.ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుద్దామని మీ అందరికీ పిలుపు నిస్తున్నాను. తోడుగా కలిసి రమ్మని, మీ బిడ్డను ఆశీర్వదించాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అందరినీ కోరుకుంటూ నా ఈ ప్రజా సంకల్ప యాత్రను ఇంతటితో ముగిస్తున్నా. ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగదు. ఇంకా కొనసాగుతుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మనందరం కలిసి సాగనంపుదాం.
– ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇచ్ఛాపురం జనసంద్రమైంది. వేలాది మంది ప్రజల అభిమానంతో బహుదా నది ఉప్పొంగింది. అశేష జనప్రవాహంతో రహదారులు కిక్కిరిసిపోయి జాతరను తలపించాయి. యువత కేరింతలు.. అక్కాచెల్లెమ్మల ఆనంద నృత్యాలు.. వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు.. జై జగన్‌ నినాదాలతో ఇచ్ఛాపురం యావత్తూ హోరెత్తింది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజైన బుధవారం భావోద్వేగాల మధ్య ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వెంట అడుగులో అడుగేశారు. ఇరుకు రోడ్లపైనా పరుగులు పెట్టారు. ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నా.. వెనుకాడకుండా జగన్‌ బాటలో నడిచి తమ అభిమానం చాటుకున్నారు. ‘ప్రజా సంకల్పం’ముగింపు సభ నుంచి ‘విజయ సంకల్పానికి’ప్రతినబూనారు.  

యుద్ధానికి పోతున్న సైన్యంలా.. 
ప్రజా సంకల్పయాత్ర ఆఖరి ఘట్టాన్ని చూసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాల నుంచి సైతం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి కదలివచ్చారు. దీంతో దారులన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనం.. జనమే. బుధవారం ఉదయం పాదయాత్ర శిబిరం నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కొద్దిక్షణాల్లోనే అశేష జనసంద్రంలో కలిసిపోయారు. అంతమందిలో ఆయనెక్కడున్నారో గుర్తించడం చాలా మందికి కష్టమైపోయింది. పాదయాత్ర మొదలైన ఐదు నిమిషాల్లోనే కిలోమీటర్ల కొద్దీ జనం ఆయన వెన్నంటే ముందుకు సాగారు. ‘ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తే ఓ సైన్యం యుద్ధానికి పోతున్నట్టుగా ఉంది’అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించగా.. ‘అవును ఇది చంద్రబాబు మీదకు సాగే యుద్ధమే. అవినీతిని అంతం చేసే సైన్యమే’అంటూ ఇచ్ఛాపురానికి చెందిన మారం రాజులు అనే వ్యక్తి ఉద్వేగంతో చెప్పాడు. ఇచ్ఛాపురం సభ ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని పలువురు పేర్కొన్నారు. జగన్‌ ప్రసంగం సాగుతున్నంత సేపూ ప్రజలు జగన్‌ నినాదాలు చేస్తూ, చప్పట్లతో ప్రతిస్పందించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనను లక్ష్యంగా చేసుకుని జగన్‌ నిప్పులుచెరుగుతున్నప్పుడు.. ప్రజలు సైతం ఆవేశంతో ఊగిపోయారు. ‘కాబోయే సీఎం..’అంటూ జేజేలు పలికారు.  

పండుగ ముందే వచ్చింది..  
ఇచ్ఛాపురం వీధుల్లో ఎక్కడ చూసినా సందడే. ఏ గడపకెళ్లినా ఆనందమే. పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని చూడ్డానికి ఆ ఊరివాళ్లు తమ బంధువులను, స్నేహితులను ఇళ్లకు పిలుచుకున్నారు. ‘వైఎస్‌ కుటుంబంలో మూడో వ్యక్తి పాదయాత్ర మా ఊరిలో ముగుస్తోంది. మాకిప్పుడే సంక్రాంతి వచ్చినట్టు ఉంది’అని ఏరాసుల రామారావు ఆనందం వ్యక్తం చేశాడు. ‘వైఎస్‌ను, ఆయన కూతురు షర్మిలమ్మను, ఇప్పుడు జగన్‌ను.. ముగ్గుర్నీ కలిశాను. చాలా సంతోషంగా ఉంది’అని పద్మజ తెలిపింది. మరికొందరు పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయ సంకేతాలతో ఇళ్ల ముందు రంగవల్లులు దిద్దారు. ‘పండగకు తెచ్చుకున్న దుస్తులు ఇప్పుడే వేసుకున్నాం’అని ఈశ్వరి, కల్పన తెలిపారు.  

ఈ బాబును సీఎంగా చూడాలనుందయ్యా.. 
పాదయాత్ర ముగింపు రోజున కొందరు ఉద్వేగానికి గురయ్యారు. ‘ముగింపు సన్నివేశం చూడ్డానికి వచ్చారా?’అని రామశౌరమ్మ అనే మహిళను అడగ్గా.. ‘కేవలం చూడ్డానికే రాలేదయ్యా... ఈ బాబును సీఎంగా చూడాలనుంది. ఏడాదిగా నడిచాడు బిడ్డ. ఎలా ఉన్నాడో చూద్దామనొచ్చాం. ఈయనొస్తే మాలాంటోళ్లకు మంచి జరుగుతుందయ్యా..’అంటూ ఉద్వేగానికి గురైంది. ‘తెలుగుదేశపోళ్లు ఎన్ని కష్టాలు పెట్టారు ఆ బిడ్డను? కష్టం ఊరికే పోదయ్యా’అని కాల ముత్యాలు, మద్ది ఈశ్వరమ్మ పేర్కొన్నారు. ఈ ఇద్దరూ స్థూపం దగ్గర ఇతర మహిళలతో కలిసి ఆనందంగా నృత్యాలు చేశారు. మరోవైపు ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజును చిత్రీకరించేందుకు పలు జాతీయ, ప్రాంతీయ చానెళ్లు పోటీపడ్డాయి. ఎవర్ని కదిపినా జగన్‌ పాదయాత్ర ఓ ప్రభంజనమంటూ వర్ణిస్తుండటంతో జనాభిప్రాయమేంటో అర్థమైందంటూ పలువురు విలేకరులు వ్యాఖ్యానించారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ కూడా అంత జన ఒత్తిడిలోనూ ప్రతి ఒక్క మీడియా ప్రతినిధితోనూ మాట్లాడి తన మనోగతాన్ని వివరించారు.

వైఎస్సార్‌సీపీలోకి ప్రముఖ సినీనటుడు భానుచందర్‌ 
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజైన బుధవారం పార్టీ లో పలువురు చేరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కొత్త అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరంలో ప్రముఖ సినీనటుడు భాను చందర్‌ వైఎస్‌ జగన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్‌ నాయకురాలు, ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు బొడ్డేపల్లి రమేశ్‌ పార్టీలో చేరారు. ఆయనకు వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. 

‘విజయ సంకల్పం’ ఆవిష్కృతం 
జై జగన్‌.. జై జై జగన్‌.. కాబోయే సీఎం అంటూ మిన్నంటిన నినాదాల మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు.  వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top