పీసీసీలో ‘దానం’పై వాడీవేడి చర్చ

Hot Discussion On Danam Nagender In TPCC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లడంపై పీసీసీలో వాడీవేడిగా చర్చ జరిగింది. దానం పార్టీ నుంచి బయటకు వెళ‍్లడానికి కారణం ఏంటని పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ అగ్ర నేతలను ప్రశ్నించారు. సంపత్‌ కుమార్‌కు పదవి ఇచ్చేందుకు రాహుల్‌కు సమయం ఉంటుందని కానీ.. దానం కోసం సమయం లేదా అని నిలదీశారు. యువకులను పదవులు అంటున్నారు కానీ.. పార్టీకి అనుభవంతులు అవసరం లేదా అని మాజీ ఎంపీ వి. హనుమంతురావు ప్రశ్నించారు. రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన తనను మంత్రి కాకుండా అడ్డుకున్నారన్నారని అంజన్‌కుమార్‌ యాదవ్‌ వాపోయారు. శక్తి యాప్‌, బూత్‌ కమిటీలు అంటూ ఇంకా ఎన్నిరోజులు.. జిల్లాల్లో తిరిగి ఎన్నికల కోసం పని చేయరా అని మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు.

కేసీఆర్‌ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధం
రాష్ట్రానికి కొత్త ఇన్‌ఛార్జ్‌, కార్యదర్శులు రావడం సంతోషంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ముగ్గురు కార్యదర్శులకు 17 పార్లమెంట్‌ స్థానాల బాధ్యతలు అప్పగించామని, పార్టీని పటిష్టం చేయడం వారి బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమే అన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మీడియా ద్వారా ప్రతిపక్షాలకు సవాలు అంటున్నారని, రాజీనామా చేస్తామంటే వద్దన్నామా అని విమర్శించారు. దానం టీఆర్‌ఎస్‌లో చేరడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. దానం టీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని, దొరల పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్‌ బీసీలకు అన్యాయం చేసిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top