
సాక్షి, గోపాలపురం : గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతోపాటు వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాజుపాలెం గ్రామంలో ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. స్థానికంగా అధికంగా ఉన్న డయాలిసిస్ వ్యాధి గ్రస్తులు జననేత వైఎస్ జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రజసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. నేడు నల్లజర్లలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.