వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి

Former MLA Gurunath Reddy Joins YSR Congress Party - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్‌ జగన్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటనుంచీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని, నాలుగున్నరేళ్లుగా  దోచుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో పునాది నిర్మాణం పూర్తికాకపోయినా.. అక్కడకు వెళ్లి పదిసార్లు ఫోటోలకు పోజులిచ్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసిన చంద్రబాబు.. తన అవసరాల కోసం బీజేపీని వదిలిపెట్టి.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టారని, తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురునాథ్‌రెడ్డి ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top