..ఆ ఐదుగురు

Five People is Playing a key role behind KCR  - Sakshi

కేసీఆర్‌కు ‘పంచపాండవుల’ చేదోడువాదోడు

వ్యూహం పన్నితే ప్రత్యర్థి విలవిల్లాడాలి. ఆరోపణ.. గుక్కతిప్పుకోనివ్వకూడదు. వాగ్బాణాలు వదిలితే.. అవతలి వారు ఉక్కిరిబిక్కిరి కావాలి. అటువంటి వ్యూహాలకు, వాగ్దాటికి పెట్టింది పేరు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. అయితే, ఆయన అనుసరించే వ్యూహాలు, రచించే ప్రణాళికల వెనుక ఐదుగురు సభ్యులు తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. వివిధ అంశాల్లో ఆయనకు అన్నీతామై వ్యవహరిస్తున్న ఆ ఐదుగురి పరిచయం..

తన్నీరు హరీశ్‌రావు
కేసీఆర్‌కు నమ్మకస్తుడు. ట్రబుల్‌ షూటర్‌. ఎన్నికల వ్యూహంలో, గెలుపు రాజకీయాల్లో సిద్ధహస్తుడు. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు మెదక్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలలో, రాష్ట్రంలోని పలు గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఓటమి లక్ష్యంగా ఏర్పాటైన కూటమిని ఢీకొట్టడంలో ముందున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ రావాలనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లక్ష్యంగా వాటిని అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌–టీడీపీ–టీజేఎస్‌ కూటమి వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలా నష్టం కలుగుతుందో సోదాహరణంగా తెలుపుతున్నారు. 

జోగినపల్లి సంతోశ్‌కుమార్‌
టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి. రాజ్యసభ సభ్యుడు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నమ్మినబంటు. ఆంతరంగిక సహాయకుడు. కేసీఆర్‌ దినచర్య మొదలుకాక ముందే సంతోష్‌ పని ప్రారంభించి.. కేసీఆర్‌ విశ్రమించాక ముగిస్తారు. ఈయనకు తెలియకుండా కేసీఆర్‌కు సొంత విషయాలంటూ ఏమీ ఉండవు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరైనా టీఆర్‌ఎస్‌ అధినేతతో మాట్లాడాలన్నా, కలవాలన్నా సంతోశ్‌ ద్వారానే.. వివిధ మార్గాల్లో వచ్చే సమాచారాన్నంతా కేసీఆర్‌కు చేరవేస్తారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆలోచనలకు తగ్గట్టుగా అన్నీ చక్కబెడుతుంటారు. కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు, పార్టీ నేతలకు ఈ సమాచారం చేరవేస్తుంటారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యవహారాలన్నీ సంతోష్‌కుమార్‌ కేంద్రంగానే జరుగుతుంటాయి. పార్టీకి, ప్రభుత్వానికి, అధికారులకు – కేసీఆర్‌కు మధ్య వారధి సంతోశ్‌. 

పల్లా రాజేశ్వర్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి. శాసనమండలి సభ్యుడు. విద్యార్థి నేతగా ఒంటబట్టిన సంస్థాగత వ్యవహారాల నిర్వహణ ఈయనను కేసీఆర్‌కు సన్నిహితుడిని చేసింది. అనంతరం టీఆర్‌ఎస్‌లో కీలకవ్యక్తిగా మారారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నమ్మకమైన నేత. టీఆర్‌ఎస్‌ సంస్థాగత వ్యవహారాల బాధ్యతలన్నీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే అప్పగిస్తారు కేసీఆర్‌. బహిరంగసభల నిర్వహణలోనూ ఆయా జిల్లాల నేతలకు, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తుంటారు. కేసీఆర్‌ దినచర్య ప్రకారం పూర్తి సమయం పని చేస్తుంటారు. పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలను సైతం పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున నల్లగొండ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌లో వేగంగా గుర్తింపు పొందిన పల్లా.. అటు పార్టీకి, ఇటు అధినేత కేసీఆర్‌కు ప్రోగ్రామ్‌ డిజైనర్‌ అన్నమాట. 

బి.వినోద్‌కుమార్‌
టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు. కరీంనగర్‌ ఎంపీ. టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల సమన్వయకర్తగా వ్యవహరిస్తుంటారు. న్యాయవాది అయిన ఈయనది.. కేసీఆర్‌ విధాన నిర్ణయాల్లో కీలకపాత్ర. కేసీఆర్‌ ఆలోచనలను చట్టప్రకారం, నిబంధనలకు అనుగుణంగా కాగితంపై రూపొందించడంలో సిద్ధహస్తుడు. కేసీఆర్‌ వాదనను గట్టిగా వినిపించేందుకు అవసరమైన న్యాయ అంశాలను జోడిస్తుంటారు. డ్రాఫ్ట్స్‌మాన్‌ అనదగ్గ ఈయన కేసీఆర్‌కు చేదోడువాదోడు.

కె.తారకరామారావు
టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత అన్నీతానై వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పార్టీపై పూర్తి పట్టు సాధించారు. టిక్కెట్ల ఖరారు, అసంతృప్తులకు బుజ్జగింపులు, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారం.. అన్నీ కేటీఆర్‌ ఆధ్వర్యంలోనే.. సోషల్‌ మీడియా వేదికగా పార్టీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లక్ష్యంగా కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్‌ను తలపిస్తున్నాయి. నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనను వివరిస్తూ మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాల్సి ఉందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దాదాపు 30 సెగ్మెంట్లలో అసమ్మతి ఉన్నా.. ఎక్కడా తిరుగుబాటు లేకుండా చేశారు. ‘ప్రజాఆశీర్వాదసభ’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 40చోట్ల ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థి పార్టీల్లోని ముఖ్యులను టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడంలో కేటీఆర్‌దే కీలకపాత్ర. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్‌ యాక్షన్‌ టీం కమాండర్‌ కేటీఆర్‌. 

రె‘బలవంతులు’..!
‘‘గెలిస్తే రెబలంత సుఖం ఉండదు’’ 
‘‘అదేంట్సార్‌ కొత్త సామెత చెబుతున్నారూ. జరుగుబాటైతే రోగమంత భోగం ఉండదు అన్నట్లుందిది’’ 
‘‘కాదా మరి.. ఇప్పటివరకూ ఒక కష్టం.. ఇప్పట్నుంచి రెబల్స్‌ ముప్పు’’ 
‘‘మీరు చెబుతున్న తంతూ.. ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే రోతగా అనిపిస్తోంది’’
‘‘నీకు రోతగా అనిపిస్తోందేమోగానీ నాకు పాత సామెత గుర్తొస్తోంది’’ 
‘‘ఏమిట్సార్‌ అది’’ 
‘‘పుడుతూ పుడుతూ పుత్రులు.. పెరుగుతూ పెరుగుతూ ప్రేమలు.. పెండ్లి తర్వాత పగలు–ప్రతీకారాలు’’ 
‘‘దీనికీ ప్రస్తుత పరిస్థితికీ సాపత్యమేమిటి సార్‌’’ 
‘‘ఉంది. పుట్టడం అనే తంతు తర్వాత అటు కన్న వ్యక్తులు తల్లిదండ్రులవుతారు. కన్నబిడ్డలు పుత్రులవుతారు. ఒకరిద్దరు పుట్టాక.. వాళ్లు పెరిగే క్రమంలో అన్నదమ్ముల మధ్య ప్రేమలుంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇక తల్లిదండ్రులకు పిల్లల మీద.. ఇటు పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమలెలాగూ తప్పనిసరి. అప్పుడొస్తుంది ఒక కీలకమైన దశ! అదే పెండ్లి దశ!! దాంతో కుటుంబ రంగస్థలం మీదికి కొత్త వ్యక్తులొస్తారు. కొత్త వ్యక్తుల రంగ ప్రవేశం కాగానే ఒక తోడికోడలికీ మరో తోడికోడలికీ సరిపడకపోవచ్చు. అత్తకూ కోడళ్లకూ పొసగకపోవచ్చు. మామగారి రూల్స్‌ అల్లుడికి నచ్చకపోవచ్చు. అల్లుడి ధోరణి మామగారికి కొరుకుడు పడకపోవచ్చు. గొప్ప సామెత చెప్పాడయ్యా ఎవరోగాని మహానుభావుడు’’ 
‘‘దీనికీ మన రాజకీయాలకూ సంబంధం ఏమిటి సార్‌?‘‘ 
‘‘కూటమి పుట్టేటప్పుడు ఒకరి ఓట్లతో మరొకరం తప్పక గెలుస్తామనే భావన ఉంటుంది. అప్పుడు మొదలవుతాయి ప్రేమలు. తర్వాత అభ్యర్థుల సెలక్షన్‌ జరుగుతుంది. దాంతో జాబితాలోకి ముందెన్నడూ ఎరగని కొత్త ముఖాలు వస్తాయి. వాటిని చూడగానే.. అప్పటివరకూ ఉన్న ప్రేమలన్నీ పక్కకు పోయి.. ఎలాగైనా ఎదుటివారిని ఓడించాలన్న పగ, కసి రగులుతాయి’’ 
‘‘బాగానే ఉందిగానీ.. మరి గెలిస్తే రెబలంత సుఖం ఉండదని మొదట ఓ మాట అన్నారు. ఆ సామెతకూ.. పుడుతూ పుడుతూ పుత్రుల సామెతకు ఏమిట్సార్‌ సంబంధం?’’
‘‘రెబల్‌ అంటే ఎవరు? పార్టీతో తెగతెంపులు చేసుకున్నవాడు. అంతేకదా. అంటే.. పార్టీ ఆంక్షలూ, నిబంధనలూ ఇవేమీ వాడికి పట్టవు. ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకున్నవాడు కుటుంబ కట్టుబాట్లు పాటించనట్టుగానే పార్టీ నుంచి రెబల్‌గా బయటకు వచ్చిన వాడూ పార్టీ విధించిన అడ్డమైన రూల్సేమీ పాటించకుండా హాయిగా, ‘స్వతంత్రం’గా పోటీ చేసుకోవచ్చు. ఒకవేళ గెలిచాడా.. ఇక ఆ తర్వాత పార్టీయే వాడిని పిలిచి హ్యాపీగా అక్కున చేర్చుకుంటుంది. అదన్న మాట సంగతి’.’

317 ..2014 ఎన్నికల బరిలో మహిళలు
2014 ఎన్నికల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి కలిపి మొత్తం 317 మంది మహిళలు వివిధ పార్టీలతో పాటు స్వతంత్రులుగానూ పోటీ చేశారు. వీరిలో 27 మంది గెలుపొందారు. 259 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. తెలంగాణ నుంచి 125 మంది దాకా పోటీ చేయగా 9 మంది గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు గెలిచారు. కోస్తా, రాయలసీమ నుంచి దాదాపు 190 మంది పోటీ చేశారు. 18 మంది విజయం సాధించారు. టీడీపీ నుంచి పదిమంది, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎనిమిది మంది గెలుపొందారు. కాగా, సికింద్రాబాద్‌ శాసనసభ స్థానం నుంచి అత్యధికంగా 9 మంది మహిళా అభ్యర్థులు, భద్రాచలం (ఎస్టీ) నుంచి ఆరుగురు, నాంపల్లి నుంచి ఐదుగురు, సనత్‌నగర్, ఆసిఫాబాద్‌ (ఎస్టీ) నుంచి నలుగురు చొప్పున.. తొమ్మిది స్థానాల్లో ముగ్గురేసి మహిళలు పోటీపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top