గులాబీ జట్టులో బ్లాక్‌ లిస్ట్‌!

Few trs mlas are in blacklist - Sakshi

గెలుపు గుర్రాల కోసం ఇప్పట్నుంచే కసరత్తు చేస్తున్న పార్టీ అధినేత

టికెట్‌ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో వడపోత

పనితీరు సరిగా లేని 20 మంది ఎమ్మెల్యేలతో జాబితా

నియోజకవర్గాల్లో పక్కా సర్వే

3 శాతం ఓటర్లతో నమూనాల సేకరణ

ఒక్కో చోటు నుంచి ఐదుగురి దాకా పోటీ

టికెట్‌ బరిలో ఏకంగా వెయ్యి మంది

సాక్షి, హైదరాబాద్‌
గులాబీ గూటిలో ఎన్నికల ఫీవర్‌ అప్పుడే మొదలైందా? కూడికలు, తీసివేతల కసరత్తు జరుగుతోందా? నియోజకవర్గాల పెంపుపై పెట్టుకున్న ఆశలు గల్లంతవడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలతో ఆశావహుల జాబితా పెరిగిపోవడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టికెట్ల విషయంలో ఇప్పట్నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నరలోపే సమయం ఉండటంతో ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్‌ ఆశావహులు ఉండటంతో వడపోత కార్యక్రమం మొదలైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని వివిధ సందర్భాల్లో తనను కలుస్తున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ చెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతమయ్యాయని, వివిధ వర్గాల ప్రజల్లోకి చొచ్చుకువెళ్లామని, కనీసం వంద సీట్లు గ్యారంటీ అని పేర్కొంటున్నారు.

సిట్టింగ్‌లు అందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. తెర వెనుక మాత్రం నేతలపై కట్టుదిట్టంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పనితీరు సరిగాలేని వారు, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారు, నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితాతో ఓ బ్లాక్‌లిస్ట్‌ తయారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్వేలు, వివిధ వర్గాల ద్వారా తెప్పించుకుంటున్న సమాచారం, నిఘా విభాగాలు అందిస్తున్న నివేదికలతో ప్రజలకు దగ్గరగా ఎవరుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో వారి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై అధినేత దృష్టి సారించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న నేతలు సహా వెయ్యి మంది దాకా ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వానికి అనుకూలమే కానీ..
సార్వత్రిక ఎన్నికల ముందస్తు కసరత్తులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా సర్వే జరుగుతున్నట్టు తెలిసింది. అత్యధికంగా నమూనాలు సేకరించడం ద్వారా కచ్చితమైన ఫలితాన్ని రాబట్టొచ్చన్న ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నారని సమాచారం. ఒక్కో నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 3 శాతం శాంపిల్స్‌ తీసుకుని సర్వే చేయిస్తున్నారని, మరో పది రోజుల్లోగా ఈ సర్వే పూర్తవుతుందని అంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల అనుకూల ఫలితాలు వస్తున్నా.. ఎమ్మెల్యేల విషయానికి వచ్చే సరికి తేడా ఉందని చెబుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ సారి ఎక్కువ శాంపిల్స్‌ తీసుకుంటున్నారని, మండలాల వారీగా కనిష్టంగా మూడు వేల మందిని నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారని అంటున్నారు.

ఒక్కో చోటు నుంచి ఐదుగురు!
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 సీట్లు గెల్చుకుంది. తర్వాత వివిధ పార్టీల నుంచి 25 మంది గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి చేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌ వైపు చూశారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరారు. దీంతో సిటింగ్‌ ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో స్థానం నుంచి సగటున నలుగురు, ఐదుగురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టినట్టు తెలుస్తోంది.

బ్లాక్‌ లిస్టులో ఎవరో..?
వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతోపాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బ్లాక్‌లిస్టులో ఉన్నారని అంటున్నారు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని జనరల్‌ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలూ కూడా ఇందులో ఉన్నారని సమాచారం. సర్వేల ద్వారా సేకరిస్తున్న ఈ సమాచారంతోనే వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ఇప్పటికే ఈ అంశాల ఆధారంగానే చేరికలు జరిగాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిట్టింగులు అందరికీ టికెట్లు దక్కుతాయని అధిష్టానం పదేపదే ప్రకటిస్తున్నా.. పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో సహజంగానే తమ పరిస్థితిపై ఒకింత స్పష్టత ఉన్న ఎమ్మెల్యేలు పనితీరును మెరుగు పరుచుకోవడం ద్వారా అధినేత కేసీఆర్‌ మనసు చూరగొనేందుకు నియోజకవర్గాలకే పరిమితమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top