మండలి ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌

EC gives relief to Uddhav Thackeray To Hold MLC Polls - Sakshi

సీఎం పదవిలో కొనసాగేందుకు ఠాక్రేకు మార్గం సుగమం

సాక్షి, ముంబై : ఓ వైపు రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.. మరోవైపు ముఖ్యమంత్రి పదవీ గండం మధ్య సతమతవుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు కేం‍ద్ర  ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మే 28లోపు ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేస్తూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరించింది. దీంతో ఠాక్రే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమం అ‍య్యింది. (ఈసీకి గ‌వ‌ర్న‌ర్‌ లేఖ)

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది నవంబర్‌ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయన శాసనసభకు గానీ, మండలికిగానీ ఎన్నిక కాలేదు. మే 28 నాటికి ఆరు నెలల సమయం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఠాక్రేను మండలికి నామినేట్‌ చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. దీనిపై గవర్నర్ గురువారం వరకూ‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. (సీఎం పదవి ఊడకుండా కాపాడండి)

ఈ క్రమంలోనే సీఎం ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని.. వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని కోరారు. ఠాక్రే విజ్ఞప్తికి స్పందించిన మోదీ వెంటనే గవర్నర్‌ కోశ్యారీతో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా చూడాలని మోదీ కోరారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో  సీఈసీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఉన్న తొమ్మది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా ఠాక్రే మండలికి ఎన్నిక కానున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top